ఇండియా కాదు భారత్ : పిల్లల పుస్తకాల్లో ఇక ఇలాగే ఉంటుంది

ఇండియా కాదు భారత్ : పిల్లల పుస్తకాల్లో ఇక ఇలాగే ఉంటుంది

దేశంలోని అన్ని పాఠ్యపుస్తకాల్లో ఇండియా అనే పదాన్ని భారత్గా మార్చాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి -NCERT ప్రత్యేక కమిటీ సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని ఎన్‌సీఈఆర్‌టీ ఛైర్మన్​ఐజాక్ వెల్లడించారు. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులుగా పురాతన చరిత్రను ప్రవేశపెట్టాలని కూడా ఎన్‌సీఈఆర్‌టీ ప్యానెల్ సిఫార్సు చేసినట్లు ఐజాక్​ తెలిపారు.

జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, ప్రణాళికలను ఖరారు చేసేందుకు ఇటీవలే ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. ఈ సిఫార్సులు చేసినట్లు ఛైర్మన్​ఐజాక్​ తెలిపారు. ప్యానెల్ చేసిన ప్రతిపాదనను కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. అన్ని సబ్జెక్ట్​ల పాఠ్య పుస్తకాల్లో ఇండియన్​ నాలెడ్జ్​ సిస్టమ్​ను ప్రవేశపెట్టాలని కూడా రికమండ్​ చేసినట్లు తెలిపారు. అయితే.. ప్యానెల్ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్‌సీఈఆర్‌టీ అధికారులు తెలిపారు.

కొద్దిరోజుల క్రితం.. పదో తరగతి పాఠ్య ప్రణాళిక నుంచి కొన్ని పాఠ్యాంశాలను తొలగిస్తూ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పాఠాల్లో పిరియాడిక్‌ టేబుల్‌, ప్రజాస్వామ్యం, శక్తి వనరుల పాఠ్యాంశాలను తొలగించాలని నిర్ణయించింది. విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకే.. ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్‌సీఈఆర్‌టీ వెల్లడించింది. పర్యావరణ సుస్థిరత, శక్తి వనరులు, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి సవాళ్లు, రాజకీయ పార్టీల పూర్తి అధ్యాయాలను తొలగించింది.

ALSO READ | మిడిల్ క్లాస్ జయహో వందే భారత్: ఈ రూట్లలో తగ్గిన విమానం టికెట్లు, ట్రాఫిక్

దేశం పేరును ఇండియా నుంచి భార‌త్‌ గా మార్చేందుకు ప్రయ‌త్నాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన జీ20 స‌ద‌స్సు స‌మ‌యంలో.. ఇండియా నేమ్‌ప్లేట్ ఉన్న స్థానంలో భార‌త్ అని రాసిపెట్టిన విష‌యం తెలిసిందే. భార‌త రాష్ట్రప‌తి, భార‌త ప్రధాని అని ప‌లు సంద‌ర్భాల్లో వాడారు. ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా పాఠ్య పుస్తకాల్లోనూ ఇండియా పేరును భార‌త్‌గా మార్చేందుకు ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి. స్కూల్ పుస్తకాల్లో భార‌త్ అని రాయాల‌ని ఎన్‌సీఈఆర్‌టీ క‌మిటీ ప్రతిపాద‌న చేసింది. నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ రీస‌ర్చ్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి క‌మిటీ చేసిన సూచ‌న‌ల ప్రకారం స్కూల్ క‌రిక్యుల‌మ్‌ను మార్చనున్నారు.