
హైదరాబాద్, వెలుగు: సిటీలో ఆపరేషన్ రోప్ (రిమూవల్ అబ్‌స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్‌మెంట్) సిస్టమ్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు, వాహనదారులు, పాదచారులకు సమస్యలు కలిగిస్తున్న ప్రాంతాలను సిటీ పోలీసులు గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగా జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్‌తో కలిసి సీపీ సీవీ ఆనంద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో రోడ్లను పరిశీలించారు. వెహికల్స్ రాకపోకలకు అడ్డంగా ఉన్న ఆక్రమణలను తొలగించారు. కాలనీ రోడ్లపై వెహికల్ పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి షాపులను పెట్టే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ముందుగా అవగాహన కలిగిస్తామని, ఆ తర్వాత ఫైన్ లు వేస్తామన్నారు.
ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే వెయ్యి ఫైన్
సిగ్నళ్ల వద్ద స్టాప్ లైన్‌ను దాటుతున్నోళ్లు, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తున్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ రైడింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అన్ని సిగ్నల్స్ వద్ద పాయింట్ డ్యూటీ పోలీసులతో వెహికల్ చెకింగ్ చేశారు. ఫ్రీ లెఫ్ట్ రూట్‌లో వెహికల్ నిలిపితే రూ.వెయ్యి, స్టాప్‌లైన్ క్రాస్ చేసిన వారికి రూ.100 ఫైన్ వేశారు. ఇదేటైంలో పెండింగ్ చలాన్లు కూడా వసూలు చేశారు. కార్లు పార్క్ చేస్తే రూ.100 ఫైన్, రూ.600 టోయింగ్ చార్జెస్ వసూలు చేస్తున్నారు. నో పార్కింగ్ ప్లేసెస్‌లో బైక్‌లు పార్క్ చేస్తే రూ.100 ఫైన్, రూ.200 టోయింగ్ చార్జెస్ విధించారు.
ఫస్ట్ డే రూ. 3.65 లక్షల ఫైన్లులు
ఆపరేషన్ రోప్‌లో భాగంగా మొదటి రోజు 25 ట్రాఫిక్ యూనిట్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాయి. 472 మంది వాహనదారులకు ఫైన్లు వేశారు. కమర్షియల్ ప్రాంతాల్లో 18 మంది ఓనర్లపై కేసులు నమోదు చేశారు. మొత్తం రూ. 3.65 లక్షల ఫైన్లు వసూలు చేశారు.
సౌలతులు కల్పించకుండా ఫైన్లా?
కొత్త విధానంపై వాహనదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. పార్కింగ్ సౌలతులు కల్పించకుండా ఫైన్లు విధించడం ఏంటని వాహనదారులు మండిపడుతున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్‌ల వద్ద తప్పని సరిగా పార్కింగ్ ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు ఆపారని బైక్ తగలబెట్టుకుండు
ఖైరతాబాద్: రాంగ్రూట్లో వచ్చినందుకు పోలీసులు ఆపారని ఓ వ్యక్తి తన బైక్‌ను అక్కడికక్కడే తగలబెట్టుకున్నాడు. ఎల్లారెడ్డిగూడకు చెందిన అశోక్ సోమవారం బైక్‌పై మైత్రివనం వద్ద రాంగ్రూట్లో వస్తుండగా అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ఆపాడు. కోపంతో అశోక్ బైక్ పెట్రోల్ ట్యాంక్ఓపెన్ చేసి నిప్పంటించాడు. ట్రాఫిక్ పోలీసుల వేధింపులతోనే అశోక్ బైక్ తగలబెట్టుకున్నాడని వస్తున్న వార్తలు కరెక్ట్ కాదని పోలీసులు తెలిపారు.రాంగ్రూట్లో వచ్చినందుకే అక్కడి కానిస్టేబుల్ ఆపాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు ఫైల్ చేశామని తెలిపారు.