ఢిల్లీకి చేరిన మరో ఫ్లైట్.. విద్యార్థులకు కిషన్ రెడ్డి స్వాగతం

ఢిల్లీకి చేరిన మరో ఫ్లైట్.. విద్యార్థులకు కిషన్ రెడ్డి స్వాగతం

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులతో మరో స్పెషల్ ఫ్లైట్ ఇండియా చేరుకుంది. హంగేరి రాజధాని బుదాపెస్ట్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి స్పైస్ జెట్ విమానంలో మన విద్యార్థులను ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన అందులో వచ్చిన వారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులతో ఆయన మాట్లాడి.. ధైర్యం చెప్పారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి ఒక్క విద్యార్థినీ సేఫ్ గా తీసుకొస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తరఫున.. విద్యార్థులకు స్వాగతం చెబుతన్నానని అన్నారు. ఈ కష్ట సమయంలో అక్కడ చిక్కుకున్న మన పౌరులు చూపిన తెగువ ఎంతో గొప్పదని, ఈ విద్యార్థులు, వారి కుటుంబసభ్యులను చూసి దేశం గర్విస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. వార్ జోన్ నుంచి మన పౌరులను తీసుకొచ్చేందుకు ధైర్యంగా తమ వెళ్తున్న ఫ్లైట్ సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మన విద్యార్థులను సేఫ్‌గా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారు సరిహద్దు ప్రాంతానికి చేరుకుంటే.. అక్కడి నుంచి పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల నుంచి స్పెషల్ ఫ్లైట్స్‌లో ఇండియాకు చేరుస్తోంది. ఈ క్రమంలో యుద్ధ బీభత్సం మధ్య భారతీయులకు ఎటువంటి హాని చేయకుండా ఉండేలా ప్రధాని మోడీ.. ఉక్రెయిన్, రష్యా దేశాల అధ్యక్షులతో చర్చలు జరిపారు. ఈ మేరకు  భారత విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులకు భారత దేశ జెండాను పెట్టుకొని వెళ్తే హాని చేయబోమని రెండు వైపుల నుంచి హామీ ఇచ్చింది. దీంతో మన విద్యార్థులు ఉక్రెయిన్‌లోని సిటీల నుంచి జాతీయ జెండాలతో సరిహద్దు వరకూ చేరుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం సూచించింది. అలా పొరుగు దేశాలకు చేరుకున్న వారిలో దాదాపు 3 వేల మంది వరకు విద్యార్థులను స్పెషల్ ఫ్లైట్లలో స్వదేశానికి చేర్చింది.