- జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి
- ఐజేయూ, టీయూడబ్ల్యూజే నేతలు
సైఫాబాద్, వెలుగు: జర్నలిస్టుల హక్కుల సాధన, పత్రికా స్వేచ్ఛ, పరిరక్షణ కోసం రాజీలేని పోరాటాలు కొనసాగించాలని ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, మీడియా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐజేయూ పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ నిరసన తెలిపారు.
మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, ఆరోగ్య రక్షణ, ఇండ్ల స్థలాలు, అక్రెడిటేషన్, సంక్షేమ పథకాల అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను మీడియా స్వతంత్రంగా వెలుగులోకి తీసుకురావాలని.. కథనాలను ఆధారాలు, పత్రాలు, సంబంధిత వర్గాల స్పందనతో నిర్ధారించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ మాట్లాడుతూ ఇండ్ల స్థలాలు, సమగ్ర ఆరోగ్య భద్రత, అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో హెల్త్ కార్డుల అమలు, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య కల్పించాలని డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ మాట్లాడుతూ జాతీయ జర్నలిస్టుల భద్రతా చట్టం తీసుకురావాలని, మీడియా రంగ సమస్యలపై అధ్యయనం చేసేందుకు జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐజేయూ ఉపాధ్యక్షుడు వై.నరేందర్‌రెడ్డి, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎంఏ మజీద్, కార్యవర్గ సభ్యుడు కె.సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు వి.యాదగిరి, బి.కిరణ్ కుమార్, రాజేశ్, హెచ్ యూజే అధ్యక్ష, కార్యదర్శులు శిగ శంకర్ గౌడ్, షౌకత్, చిన్న మధ్య తరహా పత్రికల జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యూసుఫ్ బాబు, అశోక్, దాసు, ఉర్దూ జర్నలిస్ట్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ గౌస్, హెచ్‌యూజే, ఫోటో జర్నలిస్టుల సంఘం, వీడియో జర్నలిస్టుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
