చర్చనీయాంశంగా మారిన గజ్వేల్ యాదవుల సమ్మేళనం

చర్చనీయాంశంగా మారిన గజ్వేల్ యాదవుల సమ్మేళనం

కరీంనగర్, వెలుగు: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడెంలో ఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవుల ఆత్మీయ సమ్మేళనం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ యాదవ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసినన ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను పిలవకపోవడం, కేవలం మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ ను మాత్రమే పిలవడం హాట్ టాపిక్ గా మారింది. కొమురవెల్లి మల్లన్న దర్శనంతోపాటు ప్రజాప్రతినిధులకు సన్మానం పేరిట నిర్వహించిన ఈ సమావేశానికి ఎక్కువగా కరీంనగర్, రాజనన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ యాదవ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ యాదవ నాయకులే ఎక్కువగా హాజరైనట్లు తెలిసింది. పైకి సన్మాన కార్యక్రమంగా నిర్వహించినప్పటికీ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బి.వినోద్ కుమార్ ను ఎంపీగా గెలిపించుకోవడమే లక్ష్యంగా పని చేయాలని, యాదవులకు సీఎం కేసీఆర్ చాలా చేశారని వేదిక మీద ఉన్న నేతలంతా మాట్లాడడంతో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని తలపించినట్లు ఆ సమ్మేళనానికి హాజరైన సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. 

యాదవులకు ప్రాధాన్యమివ్వండి.. 

గతంలో ఎన్నికల సమయంలోగానీ, ఇతర సందర్భాల్లోగానీ ఏ కుల సంఘ ఆత్మీయ సమ్మేళనం పెట్టినా ఆయా కులాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులతోపాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యేవారు. కానీ ఈ సమ్మేళనానికి యాదవ సామాజిక వర్గానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ షీప్‌‌ అండ్‌‌ గోట్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ దూదిమెట్ల బాలరాజును మాత్రమే పిలిచారు. పైగా ఈ జిల్లాతో సంబంధం లేని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని పిలిచి..ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులను పిలవకపోవడం, అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఏకైక మంత్రి గంగుల కమలాకర్ ను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత పార్లమెంట్​ ఎన్నికల సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్.. బోయినిపల్లి వినోద్​కుమార్​ గెలవకుండా పరోక్షంగా ఆయన ఓటమికి పని చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగానే గంగులను పిలవలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సమ్మేళనానికి హుజూరాబాద్ టీఆర్ఎస్ ఇన్ చార్జీగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికే హుజూరాబాద్ టికెట్ అంటూ కేటీఆర్ పరోక్ష సంకేతాలిచ్చిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో బై ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిన గెల్లు భవితవ్యం ఏమిటనే చర్చ అక్కడ జరిగినట్లు తెలిసింది. ప్రభుత్వం భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో యాదవులకు ప్రాధాన్యం కల్పించేలా సీఎం కేసీఆర్ ను ఒప్పించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను యాదవ నేతలు కోరినట్లు సమాచారం.