
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీదే అధికారమని ‘టైమ్స్ నౌ--–ఈటీజీ రీసెర్చ్’ సర్వేలో వెల్లడైంది. బీజేపీ కూటమికి 292 నుంచి 338 సీట్లు వస్తాయని శుక్రవారం ఆ సంస్థ ప్రకటించింది. కాంగ్రెస్ కూటమికి 106 నుంచి 144 సీట్లు రావచ్చని వెల్లడించింది. ఏపీలో వైఎస్ఆర్ సీపీకి 24 నుంచి 25 సీట్లు వస్తాయని సర్వేలో అంచనా వేశారు. అలాగే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎవరిని ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్నారంటే.. అత్యధికంగా 64% మంది మోడీకే జైకొట్టారు. ఆ తర్వాత రాహుల్ గాంధీకి 13%, కేజ్రీవాల్ కు 12%, నితీశ్ కుమార్ కు 6%, కేసీఆర్ కు 5% మంది ఓటేశారు.
ప్రతిపక్షాలన్నీ ఏకమైనా మోడీని ఎదుర్కోలేరు
ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అయినా.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దీటుగా ఎదుర్కోలేవని సర్వేలో వెల్లడైంది. రాహుల్ గాంధీపై లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటుతో కాంగ్రెస్కు ఏమైనా ఫాయిదా ఉంటుందా అని ప్రశ్నించగా.. బెనిఫిట్ ఏమీ ఉండదని ఎక్కువ మంది చెప్పారు. దేశంలో కరప్షన్ పై సీబీఐ, ఈడీ పనితీరు బాగుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాతే ప్రతిపక్షాలు అలయెన్స్ గా ఏర్పడవచ్చని కూడా ఎక్కువ మంది చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలంతా ఏకమైనా ప్రధాని మోడీకి టఫ్ ఫైట్ ఇవ్వలేరని సర్వేలో అత్యధికంగా 49% మంది అభిప్రాయపడ్డారు. 19% మంది మాత్రం కొంత వరకు టఫ్ ఫైట్ ఇవ్వగలరని చెప్పారు. 17% మంది మాత్రమే ప్రతిపక్షాలు ఏకమైతే మోడీకి దీటుగా గుడ్ ఫైట్ చేయగలవన్నారు. ఇక మిగిలిన 15% మంది మాత్రం ఏ విషయమూ చెప్పలేమన్నారు.