అధ్యాపకుల భర్తీకి అనుమతి ఇవ్వండి.. గవర్నర్‭కు వినతి

అధ్యాపకుల భర్తీకి అనుమతి ఇవ్వండి.. గవర్నర్‭కు వినతి

పదేళ్లుగా అధ్యాపకుల నియామకాలు లేకపోవటంతో... రోజురోజుకూ యూనివర్శిటీల్లో అధ్యాపకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు సీనియర్ ప్రొఫెసర్లు పదవీ విరమణ పొందుతుండటంతో విశ్వవిద్యాలయాల్లోని విభాగాలన్నీ ఖాళీ అవుతున్నాయి. దీంతో.. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల భర్తీకి వెంటనే అనుమతి ఇవ్వాలని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్... గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేసింది. ఉస్మానియా యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జి. మల్లేశం నేతృత్వంలోని బృందం.. రాజ్ భవన్‭లో గవర్నర్‭ను కలుసుకొని విశ్వవిద్యాలయాల సమస్యలపై చర్చించారు. పదవీ విరమణ చేసి వెళ్లిపోయిన వారి స్థానంలో పార్ట్ టైం, కాంట్రాక్ట్ అధ్యాపకులు నెట్టుకొస్తున్నారని గవర్నర్‭కు చెప్పారు. రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవటంతో న్యాక్ గ్రేడింగ్ నష్టపోతున్నామని.. ఫలితంగా యుజిసి, రూసా నిధులు రాకుండా పోతున్నాయని ప్రొఫెసర్ మల్లేశం బృందం గవర్నర్ దగ్గర ఆవేదన వ్యక్తం చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వం 2017లో విశ్వవిద్యాలయాల్లో 1061 అధ్యాపక పోస్టులు మంజూరు చేసిందని... అయితే రకరకాల న్యాయ వివాదాల నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు వాటిని భర్తీ చేయలేకపోయాయని ప్రొఫెసర్ మల్లేశం తెలిపారు. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డును తీసుకొచ్చిందని... 2022 నవంబర్ 13న అసెంబ్లీలో బిల్ పాసైందని ఆయన చెప్పారు. అయితే ఇది గవర్నర్ దగ్గర పెండింగ్‭లో ఉందని... దీన్ని అనుమతిస్తే కామన్ రిక్రూట్‭మెంట్ బోర్డు ద్వారా యూనివర్శిటీల్లో అధ్యాపకుల ఖాళీలను నింపడానికి మార్గం సులువవుతుందని తమిళి సైకి వివరించారు.