అమెరికాలో మన సీఈఓ హత్య

అమెరికాలో మన సీఈఓ హత్య
  • అమెరికాలో మరో దారుణం..
  • మన దేశ మూలాలున్న ఫార్మా సీఈవో హత్య

న్యూయార్క్: అమెరికాలో ఘోరం జరిగింది.  మనదేశ మూలాలున్న ఫార్మా కంపెనీ సీఈవో అర్వపల్లి శ్రీరంగ న్యూజెర్సీలో ఓ దోపిడీ దొంగ తుపాకీకి బలయ్యాడు. కాసినోలో భారీ మొత్తం గెలుచుకోవడమే ఆయన పాలిట శాపంగా మారింది. ఆ డబ్బు కోసం కాసినో నుంచి ఇంటిదాకా ఆయనను ఏకంగా 80 కిలోమీటర్ల పాటు వెంటాడిన దొంగ, చివరికి ఇంట్లోకి వెళ్లి మరీ కాల్చేశాడు! 54 ఏళ్ల శ్రీరంగ అమెరికాలో ఆరెక్స్ లేబొరేటరీస్ సీఈవోగా 2014 నుంచి పని చేస్తున్నారు. వాళ్ల ఇల్లు న్యూజెర్సీలోని ప్లెయిన్స్ బోరోలో పోష్ ఏరియాలో మిగతా ఇళ్లకు కాస్త దూరంగా, విశాలంగా ఉంటుంది. లోకల్‌‌ టైమ్‌‌ ప్రకారం మంగళవారం రాత్రి శ్రీరంగ పెన్సిల్వేనియాలోని పార్క్స్ కాసినోకు వెళ్లారు. చాలాసేపటిదాకా పందాలు కాసి, ఏకంగా 10 వేల డాలర్ల దాకా గెలుచుకున్నారు. పెన్సిల్వేనియాకే చెందిన జెకయ్ రీడ్ జాన్ అనే 27 ఏళ్ల దోపిడీ దొంగ ఇదంతా చూస్తూ వచ్చాడు. తెల్లవారుజామున హ్యాపీగా కాసినో నుంచి బయల్దేరిన శ్రీరంగను ఇంటిదాకా 80 కిలోమీటర్ల  పాటు వెంటాడాడు. ఆయన ఇంట్లోకి వెళ్లిన కాసేపటికే తానూ లోనికి దూరి దోచుకునే ప్రయత్నం చేశాడు. ప్రతిఘటించిన శ్రీరంగను కాల్చేసి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఆయన భార్య, కూతురు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. కొడుకు ఇంట్లో లేడు. జాన్ ను పోలీసులు అరెస్టు చేసినట్టు న్యూయార్క్ పోస్ట్ డైలీ తెలిపింది.

ఇరుగుపొరుగులో మంచి పేరు
శ్రీరంగకు స్థానికంగా చాలా పేరుంది. ఆయన ఇకలేరంటే నమ్మలేకపోతున్నామంటూ ఇరుగుపొరుగు కన్నీటిపర్యంతమయ్యారు. జరిగిన దారుణాన్ని తల్చుకుంటే షాకింగ్‌‌గా ఉందని శ్రీరంగ పొరుగింట్లో ఉండే షీజా ఖాన్ అన్నారు. ‘‘మరీ 80కిలో కార్లో వెంటాడి మరీ ఇంట్లో దూరి దోచుకునే ప్రయత్నమా! నమ్మశక్యంగా లేదు!! మా కమ్యూనిటీ మొత్తాన్నీ భయాందోళనలకు గురిచేసే విషయమిది. శ్రీరంగ మంచి వ్యక్తి. ఏ పండుగ వచ్చినా అందరినీ పిలిచి చాలా బాగా జరిపేవారు” అని గుర్తు చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితమే వాళ్లు ఈ ఇంటికి షిఫ్టయ్యారని చెప్పారు. శ్రీరంగ చాలా కష్టించి పనిచేసేవారని అభీ కనిత్కర్ చెప్పారు. ఇంకెవరైనా 85 ఏళ్ల వయసుకు చేయగలిగినంత పని చేశారన్నారు.