వర్షాల ఎఫెక్ట్ : కళ్ల ముందు కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్..

వర్షాల ఎఫెక్ట్ : కళ్ల ముందు కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్..

ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. వరదలకు పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడడంతో మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే మూడంతస్తుల హోటల్ పేకమేడలా కూలిపోయింది. 

బిల్డింగ్ కూలిపోతుందన్న విషయాన్ని ముందుగా గ్రహించారు. దీంతో అందులో ఉన్న వారంతా బయటకు వచ్చారు. కూలిపోతున్న సమయంలో అక్కడే ఉన్న చాలామంది తమ సెల్ ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేశారు. బిల్డింగ్ ముందుగా కిందకు వంగి..  స్తంభాలతో సహా భవనంలోని పలు భాగాలు ఒక్కొక్కటిగా పడిపోవడంతో ఒక్కసారిగా మొత్తం కూలిపోయింది. క్షణాల్లోనే భవనం శిథిలాలు, ధూళిగా మారిపోయింది. పెద్ద శబ్దంతో బిల్డింగ్ కూలిపోవడంతో అక్కడ కాసేపు దుమ్ము, ధూళితో నిండిపోయింది ఆ ప్రాంతం. మూడంతస్తుల భవనం కూలడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. 

విషయం తెలియగానే రెస్క్యూ టీమ్ , పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.  నేల కూలిన మూడంతస్తుల బిల్డింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సకాలంలో భవనాన్ని ఖాళీ చేయించడంతో అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలుస్తోంది.

ఉత్తరాఖండ్  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.  భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌తోపాటు హిమాచల్‌ప్రదేశ్‌లోనూ పలు రహదారులు, భవనాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.