వామ్మో పులి.. 25 గ్రామాల్లో కర్ఫ్యూ

వామ్మో పులి.. 25 గ్రామాల్లో కర్ఫ్యూ
  • ఉత్తరాఖండ్​లోని కాలాగఢ్​​ టైగర్​ రిజర్వ్ సరిహద్దు గ్రామాల్లో కలకలం
  •  మూడు రోజుల్లో పులి దాడిలో ఇద్దరి మృతి 
  •  రాత్రి కర్ఫ్యూ.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన గ్రామపెద్దలు

డెహ్రాడూన్​: ‘‘వామ్మో.. పులి” అంటూ ఆ ఊళ్లు వణికిపోతున్నాయి. ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టేందుకూ గ్రామస్తులు జంకుతున్నారు. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు స్థానికులు పులి పంజాకు చిక్కి మరణించడంతో.. ఏ క్షణాన ఎవరిపై మళ్లీ పులులు దాడి చేస్తాయోననే భయంతో వణుకుతున్నారు. ఈ పరిస్థితి ఉత్తరాఖండ్​లోని పౌరీ గర్వాల్​ జిల్లా కాలాగఢ్​ టైగర్​ రిజర్వ్​ను ఆనుకొని ఉన్న​రిఖ్నిఖాల్​, నైనిదాంద, సిమ్లి సహా 25 గ్రామాలలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాల పెద్దలు సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఊర్లలోకి రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తామని ప్రకటించారు.

స్థానికంగా స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చారు. ఇక పులి దాడి చేసిన ఘటనల విషయానికి వస్తే.. ఏప్రిల్ 13న రిఖ్నిఖాల్​గ్రామానికి చెందిన 73 ఏళ్ల రైతు బీరేంద్ర సింగ్​ తన భార్యతో కలిసి పొలం పనుల్లో ఉండగా, అతడిపై పులి దాడి చేసింది. భార్య అరుస్తున్నా.. బీరేంద్రను పులి లాక్కొని వెళ్లింది. కొన్ని గంటల తర్వాత సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో బీరేంద్ర సింగ్​ మృతదేహాన్ని దారుణమైన స్థితిలో స్థానికులు గుర్తించారు. ఇక ఏప్రిల్​15న సిమ్లి గ్రామానికి చెందిన రిటైర్డ్​ టీచర్​ రణ్​వీర్​ సింగ్​(75) పై పులి దాడి చేసింది. పులి సగం తినేసిన రణ్​వీర్​సింగ్​ డెడ్​బాడీని.. మృతుడి ఇంటికి సమీపంలోనే స్థానికులు గుర్తించారు.

మరోవైపు ఈ పులులను బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తుల డీఎన్ఏ శాంపిళ్లను బెంగళూరులోని సెంటర్​ ఫర్​ సెల్యులార్​ అండ్​ మాలిక్యులార్​ ల్యాబ్స్​కు పంపామని, ఇద్దరిపై ఒకే పులి దాడి చేసిందా? వేర్వేరు పులులు దాడి చేశాయా? అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని ఆఫీసర్లు  తెలిపారు.