నవంబర్ 15 నుంచి 39 బొగ్గు గనుల వేలం

నవంబర్ 15 నుంచి 39 బొగ్గు గనుల వేలం

లిథియం, గ్రాఫైట్​ బ్లాకులకు త్వరలో వేలం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రారంభించనున్న ఎనిమిదో రౌండ్ వాణిజ్య బొగ్గు గనుల వేలంలో మొత్తం 39 గనులను విక్రయించనున్నట్లు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది.  రాబోయే రౌండ్‌‌‌‌‌‌‌‌లో మొత్తం 35 బొగ్గు గనులను వేలం వేస్తారు. రెండో రౌండ్​లో నాలుగు గనులను వేలం వేస్తామని బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బొగ్గు గనుల పరిశ్రమలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం,  బొగ్గు ఉత్పత్తిని పెంచడం కోసం ఎనిమిదో రౌండ్ వాణిజ్య బొగ్గు మైనింగ్ వేలం ప్రారంభించడం ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొంది.

బొగ్గు ఉత్పత్తిలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌‌‌‌‌‌‌‌గా మార్చే దిశగా ఇది ఒక అడుగు ముందుకు అని తెలిపింది. తదుపరి రౌండ్ వేలం ప్రారంభోత్సవానికి బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర సమర్థ విధానాల వల్ల  ప్రైవేటు రంగానికి గనుల కేటాయింపులు వేగంగా జరుగుతున్నాయని, రాబోయే వేలంలో మరిన్ని కొత్త కంపెనీలు పాల్గొనే అవకాశం ఉందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. మూతబడిన గనుల నుంచి కరెంటు కూడా ఉత్పత్తి చేస్తామని తెలిపింది.

ఇదిలా ఉంటే లిథియం, గ్రాఫైట్​ వంటి కీలక ఖనిజ  బ్లాకులకు త్వరలోనే వేలం నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 20 మినరల్​ బ్లాకులకు రాబోయే రెండు వారాల్లో వేలం ఉంటుంది. మనదేశంలో 12 సంస్థలకు ఖనిజాలకు వెలికితీసే సామర్థ్యం ఉందని కేంద్ర గనులశాఖ తెలిపింది.