
రెండ్రోజుల క్రితం విజయవాడలో జరిగిన నిజామాబాద్ వాసి సురేశ్ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. నిజమాబాద్ వాసి సురేశ్ ఆత్మహత్య చేసుకునే ముందు మాట్లాడిన సెల్ఫీ వీడియో బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముగ్గురు వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని సురేశ్ అందులో తెలిపాడు. అధిక వడ్డీ కోసం జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఒత్తిడి చేశాడని, అప్పటికే అతనికి రూ.40 లక్షలకుపైగా చెల్లించానని వివరించాడు. అధిక వడ్డీలు చెల్లించినా ఇల్లు జప్తు చేస్తానని బెదిరించినట్లు చెప్పాడు. వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ వీడియోలో కోరాడు సురేశ్. గణేశ్ అనే వ్యక్తికి రూ.80 లక్షల వరకు చెల్లించానని చెప్పాడు. కొవిడ్ పరిస్థితుల్లో వ్యాపారం కోసం డబ్బులు అప్పు తీసుకున్నానని వడ్డీల మీద వడ్డీలు కట్టానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య, ఇద్దరు పిల్లల వద్ద ప్రామిసరీ నోట్లపై సంతకాలు కూడా చేయించుకున్నట్లు తెలిపాడు. గూండాలతో తమపై దాడి చేయిస్తామన్నారని చెప్పాడు. దీంతో ఒత్తిడి తట్టుకోలేకే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వీడియోలో తెలిపాడు.