రాజ్ సమాధియాలా గ్రామంలో ఎన్నికల ప్రచారానికి నో పర్మిషన్

రాజ్ సమాధియాలా గ్రామంలో  ఎన్నికల ప్రచారానికి నో పర్మిషన్

గుజరాత్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మామూలుగా ఎన్నికలంటేనే ప్రచారాలు నిర్వహించడం, డబ్బు, మద్యం లాంటివి పంపిణీ చేయడం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం చూస్తూనే ఉంటాం. కానీ రాజ్‌కోట్‌లోని ఓ గ్రామం మాత్రం అందుకు విరుద్దం. అక్కడ ఎన్నికల ప్రచారానికి అనుమతి లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొంటారు. ఒకవేళ ఎవరైనా ఓటు వేయకపోతే రూ.51 జరిమానా చెల్లించాల్సిందేనని ఆ గ్రామ సర్పంచ్ చెబుతున్నారు. ఇది రాజ్ సమాధియాలా గ్రామంలో 1983నుంచి వస్తోన్న ఆచారం. ఓటు వేయాలనే నిబంధనేం లేదని, కానీ వేయకపోతే మాత్రం ఫైన్ మాత్రం కట్టాలని ఆ సర్పంచ్ స్పష్టం చేశారు.

అంతేకాదు గుజరాత్‌లోని ఈ గ్రామంలో ఎక్కడ వెతికినా ఎవరి ఇంటికీ తాళం కనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఎవరూ వారి ఇంటికి తాళం వేయరు. ఇల్లు, దుకాణదారులు మధ్యాహ్నం దుకాణాలు తెరిచే ఉంచి భోజనం చేయడానికి వెళ్లినా.. ఎలాంటి దొంగతనాలూ జరగవు. ఒకవేళ దుకాణానికి ఎవరైనా వినియోగదారుడు వస్తే.. తనకు అవసరమైన వస్తువును తీసుకుని దాని విలువ గల డబ్బును దుకాణం దగ్గర పెట్టేసి వెళ్లిపోతాడు. ఒక్క సంఘటన తప్ప ఇప్పటి వరకు ఇక్కడ దొంగతనం ఘటన జరగలేదు. ఈ గ్రామంలో ఇప్పటివరకు ఒకే ఒక్క దొంగతనం జరిగిందట. కానీ మరుసటి రోజే ఆ దొంగ తానే స్వయంగా పంచాయితీలో తన నేరాన్ని అంగీకరించి దానికి ప్రాయశ్చిత్తంగా పరిహారం చెల్లించడం గమనార్హం.

ఇక్కడ గుట్కా వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గుట్కా ఇప్పటికే ఇక్కడ నిషేధించబడింది. ఎవరూ ఈ నియమాన్ని ఉల్లంఘించకపోవడం చెప్పుకోదగిన విషయం. ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉంది. రాజ్‌కోట్ నగరానికి కేవలం 22 కి.మీ దూరంలో రాజ్‌సంధియాలా గ్రామం ఉంది. అయితే ఇక్కడ ఎన్నికలకు ఏ పార్టీ ప్రచారం చేయదు. కానీ గ్రామ ప్రజలందరూ ఖచ్చితంగా ఓటు వేయడానికి వెళ్లడం గర్వించదగ్గ విషయం.