
అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న పరిణామాలతో దేశీయంగానే కాకుండా ప్రపంచ దేశాలలో సైతం భారత ఆర్థిక బలాబలాలపై ఆసక్తికరమైన పరిశీలన జరుగుతోంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థ. భారత ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం వాస్తవ జీడీపీ 6.5% వృద్ధి, నామమాత్రపు జీడీపీ రూ.106.57 లక్షల కోట్లు (2014–15) నుంచి రూ.331.03 లక్షల కోట్లకు (2024–25) మూడు రెట్లు పెరిగింది. స్థిరమైన నిర్మాణాత్మక సంస్కరణలతో భారత ఆర్థికవ్యవస్థ జాతీయ అభివృద్ధి రేటు రెండవ త్రైమాసికంలో 7.8% వృద్ధిరేటు సాధించడం, దేశీయ వినియోగం, తయారీ నిర్మాణ రంగాలు నిలకడగా వృద్ధి చెందటం ఆర్థిక పటుత్వానికి నిదర్శనం.
భారతదేశంలో ప్రైవేటు మూలధన పెట్టుబడి 66% పెరగడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 14% పెరగడం, దేశంలో చాలాకాలంగా అతి తక్కువగా వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) ద్రవ్యోల్బణం లాంటి అంశాలు భారత్ ఆర్థిక పటిష్టతను తెలియజేస్తున్నాయి. 2024–-25 ఆర్థిక సంవత్సరంలోనే భారత్‌లో 81 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయి. గత దశాబ్దంలో మొత్తం ఎగుమతులు 76% పెరిగి, 2024–25లో 825 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి.
వీటిలో ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ ప్రధానమైనవి. 2024–25లో భారతీయ కార్పొరేట్లు ఐపీఓల ద్వారా ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.1,62,387 కోట్ల నిధులను సేకరించాయి. 2013–14లో 468 బిలియన్ల నుంచి 2024–25లో 825 బిలియన్ల డాలర్లకు పెరిగాయి. ఇది దాదాపు 76% గణనీయమైన పెరుగుదలను సూచిస్తోంది.
విదేశీ మారక నిల్వలు 700 బిలియన్ డాలర్లు
భారతదేశ విదేశీ మారక నిల్వలు జూన్ 27, 2025 నాటికి 700 బిలియన్ డాలర్లు మార్కును దాటింది. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ భారత్ 2030 నాటికి 7.3 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ప్రకారం, ఏప్రిల్ 2000- మార్చి 2025 మధ్య భారతదేశం మొత్తం ఎఫ్డీఐ ప్రవాహం రూ.91,45,988 కోట్లు (1.07 ట్రిలియన్ డాలర్లు).
కరెంట్ ఖాతా లోటు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2,21,754 కోట్లు (26.00 బిలియన్ డాలర్లు) లేదా జీడీపీలో 0.7 శాతం నుంచి రూ.1,98,726 కోట్లకు (23.30 బిలియన్ డాలర్లు) లేదా జీడీపీలో 0.6 శాతానికి తగ్గింది. సేవలు, సెకండరీ ఇన్కమ్ నుంచి అధిక నికర రాబడులు రావడమే ఈ మెరుగుదలకు కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది.
39వ స్థానంలో భారత్
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో 133 ఆర్థికవ్యవస్థల్లో భారత్ 39వ స్థానంలో నిలిచింది. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్ 2024 నాటికి 39వ స్థానానికి ఎగబాకింది. శాస్త్రీయ ప్రచురణల ప్రపంచసంఖ్యలో భారతదేశం మూడోస్థానంలో ఉంది. గత ఐదేళ్లలో మేధో సంపత్తి (ఐపి) ఫైలింగ్‌లో భారతదేశం గణనీయమైన 44% పెరుగుదలను గమనించింది. ఇది ప్రధానంగా వ్యూహాత్మక విధాన సంస్కరణలు, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ చేపట్టిన విస్తృతమైన డిజిటలైజేషన్ చొరవల ద్వారా నడిపించడమైనది. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జిఐ) 380%, డిజైన్లు 266%, పేటెంట్లు 180%, కాపీరైట్ 83%, ట్రేడ్‌మార్క్ 28%, సెమీకండక్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లేఅవుట్- డిజైన్స్ (ఎస్ఐసిఎల్డి) 20% పెరిగాయి.
స్వదేశీ ఉత్పత్తులను పరిరక్షించడం, బలమైన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను పెంపొందించడంలో ప్రభుత్వం యొక్క స్థిరమైన నిబద్ధతను ఈ గణాంకాలు నొక్కి చెబుతున్నాయి. నిరుద్యోగ రేటు 2017–18లో 6.0% నుంచి 2023–24లో 3.2%కు గణనీయంగా తగ్గింది. ఇది ఉత్పాదక ఉపాధిలోకి బలమైన శ్రామిక శక్తిని గ్రహించడాన్ని సూచిస్తోంది. అదే సమయంలో, యువత నిరుద్యోగ రేటు 17.8% నుంచి 10.2%కి తగ్గింది. ఇది ప్రపంచ సగటు 13.3% కంటే తక్కువగా ఉందని ఐఎల్ఓ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్‌లుక్ 2024 నివేదించింది.
ప్రపంచ రిజర్వు కరెన్సీగా డాలర్
ప్రపంచ ఆర్థికవ్యవస్థలో డాలరు అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా స్థానం సంపాదించుకోవడం అనేది చారిత్రక, ఆర్థిక, రాజకీయ పరిణామాల సమ్మిళిత ఫలితంగా చూడాలి. 19 శతాబ్దం వరకు బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ ప్రపంచంలో ఆధిపత్యం కొనసాగించింది. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత బ్రిటన్ ఆర్థికంగా బలహీనపడగా, అమెరికా బంగారం నిల్వలు, ఉత్పాదక శక్తి, వాణిజ్య ఆధిపత్యం వల్ల డాలర్ చాలా బలంగా ప్రపంచదేశాల ముందుకు వచ్చింది.
1944లో బ్రిటన్ ఫుడ్స్ ఒప్పందం ద్వారా డాలరును బంగారానికి ముడివేసి, మిగతా కరెన్సీలను డాలర్ ఆధారంగా మార్చడం వలన ఇది ప్రపంచ రిజర్వు కరెన్సీగా మారింది. 1971లో నిక్సన్ గోల్డ్ డాలర్ అనుబంధాన్ని రద్దు చేసినా, చమురు లావాదేవీలన్నీ డాలర్లలోనే జరపాలని అమెరికా, సౌదీ అరేబియా పెట్రో డాలర్ వ్యవస్థవల్ల డాలర్‌కు డిమాండ్ పెరుగుతూ వస్తూనే ఉంది. అమెరికా ఆర్థిక మార్కెట్ల పెరుగుదల, ఆ దేశ ట్రెజరీ బాండ్ల భరోసా, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల ప్రభావం ఉండటంతో నేటికీ ప్రపంచ విదేశీ మారక నిల్వలో దాదాపు 70% డాలర్లలోనే ఉంది. అమెరికా ఆర్థికశక్తి, రాజకీయ ప్రభావం మార్కెట్ లిక్విడిటీ వలన డాలర్ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.
డాలర్ ప్రభావంతో రూపాయి బలహీనం
భారత్, అమెరికా వాణిజ్యంలో కూడా మిగులు సాధించింది. అయినప్పటికీ భారత రూపాయి డాలర్ ప్రభావంతో బలహీనపడుతోంది. ఎందుకంటే భారత్ తన ముడిచమురులో దాదాపు 80% దిగుమతి చేసుకోవాలి. దీనివల్ల కూడా రూపాయి బలహీనమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడిదారులు డాలర్ బలపడుతున్నప్పుడు అమెరికా ఆస్తుల్లోనే పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం వల్ల అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాల నుంచి తమ పెట్టుబడులను తరలిస్తారు. దీనితో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది.
భారత్ రుణాలు, భారతీయ కంపెనీలు కూడా అనేక రుణాలు డాలర్ రూపంలోనే తీసుకున్నారు. వాటి వడ్డీ, మూలధనం చెల్లించడానికి కూడా డాలర్ల అవసరం ఉంది.
భారత్‌కు ఐటీ సేవలు ఎగుమతులు రెమిటెన్స్ ద్వారా ఎక్కువగానే డాలర్లు వస్తున్నప్పటికీ, భారతదేశంలో ఉన్న బహుళ జాతి కంపెనీలు తమ లాభాలను మాతృదేశాలకు డాలర్లలోనే తీసుకువెళ్తాయి. దాంతో రూపాయి లాభం భారీగా తగ్గుతుంది. డాలర్ బలపడితే రూపాయితోపాటు యూరోపియన్ యూనియన్ యూరో, జపనీస్ యెన్, చైనీస్ యువాన్లు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ప్రభావం కూడా రూపాయిపైన కనపడుతుంది. అమెరికా ఫెడరల్ బ్యాంకు నగదుపై ఎక్కువగా వడ్డీ ఇస్తుండటంతో పెట్టుబడిదారులు డాలర్ వైపు ఆకర్షితులవుతున్నారు.
చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి
ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడుదారులందరూ డాలర్ల రూపంలో తమ పెట్టుబడులను మార్చుకోవడం జరుగుతుంది. భారత రిజర్వ్ బ్యాంకు మార్కెట్లో డాలర్ అమ్మకాల ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ, రూపాయి బలహీనపడటానికి కారణం.. దేశీయ వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం, మూలధన ప్రవాహాలు, ప్రపంచ డాలర్ బలం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రపంచ కారకాల సంక్లిష్ట కలయిక. ఈ అంశాలను అర్థం చేసుకోవడం ద్వారానే రూపాయి విలువను స్థిరీకరించడానికి సరైన విధానాలను రూపొందించడం సాధ్యమవుతుంది.
భారతదేశం, అమెరికా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, కొత్త వాణిజ్య ఆంక్షల గురించి ఆందోళనలు కూడా రూపాయిపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. భారతదేశం స్వదేశీ మార్కెట్లలో ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వేగంగా స్వదేశంలో విస్తరించి, చమురు దిగుమతులపైనా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. రూపాయి ఇతర కరెన్సీలతో కొంత మెరుగ్గా ఉన్నా.. డాలరుతో ఉన్న ఒత్తిడిని తగ్గించే విధానాలకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
- చిట్టెడి కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ