ప్రియుడితో కలిసి భర్తను చంపి… గుండెపోటుగా నమ్మించి..

ప్రియుడితో కలిసి భర్తను చంపి… గుండెపోటుగా నమ్మించి..
  • ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
  • ఈ నెల 6న వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఘటన
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఎల్ బీ నగర్,వెలుగుప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో ఓ భార్య. ఆ తర్వాత భర్త గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది. బంధువులు అనుమానంతో పోలీసులకు కంప్లయింట్ చేయగా..అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడిని, అతడి ఫ్రెండ్ ని వనస్థలిపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పందిరిగుండు తండాకు చెందిన పథ్లావత్ ప్రసాద్ బాబు(38 ), సరోజ(26 ) దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి వనస్థలిపురం పీఎస్ పరిధిలోని ఇంజపూర్ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉంటున్నారు. ప్రసాద్ బాబు ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. ప్రసాద్ చిట్టీల వ్యాపారం చేసి నష్టాలు రావడంతో అప్పుల బారిన పడ్డాడు. అప్పులు ఇచ్చిన వారు వస్తుండటంతో ప్రసాద్ ఇంటి వద్ద ఉండకుండా తప్పించుకుని తిరిగేవాడు. దేవరకొండ తురుపుపల్లికి చెందిన బొడ్డుపల్లి నర్సింహ(30) అదే ప్రాంతంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  ప్రసాద్ బాబు భార్య సరోజకి నర్సింహతో గతంలో పరిచయం ఉండేది. ప్రసాద్ బాబు ఇంట్లో లేని సమయంలో నర్సింహ..సరోజ కోసం వచ్చే వాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్ బాబు కొన్ని రోజుల నుంచి భార్య సరోజను మద్యం తాగి వచ్చి కొట్టడం మొదలుపెట్టాడు. భర్త ప్రసాద్ బాబును అడ్డుతొలగించుకోవాలని ప్రియుడు నర్సింహతో కలిసి సరోజ ప్లాన్ వేసింది.

ఈ నెల 6న నర్సింహ బంధువు రామకృష్ణకి ఈ విషయం చెప్పాడు. రాత్రి 11 గంటలకు రామకృష్ణను తీసుకుని నర్సింహ..ప్రసాద్ బాబు ఇంటికి వచ్చాడు.  ఫైన్సాన్స్ ఇచ్చేందుకు రామకృష్ణ వచ్చాడని సరోజ భర్త ప్రసాద్ బాబుకి అతడిని పరిచయం చేసింది. ప్రసాద్ బాబు, సరోజ, నర్సింహ, రామకృష్ణ అందరూ కలిసి ఇంట్లో మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న ప్రసాద్ బాబు మెడకి టవల్ చుట్టి ముగ్గురు కలిసి అతడికి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత రామకృష్ణ, నర్సింహ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నెల 7న తన భర్త గుండెపోటుతో చనిపోయాడని సరోజ బంధువులకు సమాచారం ఇచ్చింది. ప్రసాద్ డెడ్ బాడీని దేవరకొండ సమీపంలోని సొంతూరికి తరలించారు. అంత్యక్రియలకు  ముందు బంధువులు ప్రసాద్ బాబు మెడపై గాయాలను చూసి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రసాద్ బాబు డెడ్ బాడీని సిటీకి తీసుకువచ్చి పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సరోజను విచారించారు. ప్రసాద్ బాబును తానే హత్య చేసినట్టు సరోజ ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. మంగళవారం సరోజతో పాటు ఆమె హత్యకు సహకరించిన నర్సింహ,రామకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. మీడియా సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ శంకర్, సీఐ వెంకటయ్య పాల్గొన్నారు.