
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల బెంగళూరులో ఆదివారం ( మే21) మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన వడగళ్ల వర్షం.. సుమారు గంటకు పైగా దంచికొట్టింది. ఈదురు గాలుల ధాటికి చెట్లు కూలి పలుచోట్ల వాహనాలు ధ్వంసం కాగా, కేఆర్ సర్కిల్‌లో అండర్ పాస్‌లో వరద ముంచెత్తింది. వాహనాల్లో చిక్కుకున్న వారిని స్థానికులు, పోలీసులు రక్షించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది.
వరద నీటిలో చిక్కుకున్న కారు.. యువతి మృతి
బెంగళూరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి దుర్మరణం చెందింది. విజయవాడ నుంచి బెంగళూరుకు కుటుంబంతోపాటు వెళ్లారు. మరణించిన యువతిని 22 ఏళ్ల భానురేఖగా గుర్తించారు. వేసవి సెలవులు ఉండటంతో భానురేఖ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు బెంగళూరు వెళ్లారు. నగరంలోని కేఆర్ సర్కిల్ వద్ద గల అండర్‌పాస్‌లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ నీటిని అంచనా వేయకుండా కారును ముందుకే పోనిచ్చారు. కారు అందులో నుంచి బయటకు వెళ్లుతుందని అనుకున్నారు. కానీ, నీటిలో చిక్కుకుపోయింది. కారులోకి నీరు చేరింది. ఆరుగురు కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో బయటకు రాగలిగారు. కానీ, ఆ యువతి నీటిని మింగడంతో శ్వాస ఇబ్బందిగా మారింది. ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అక్కడే మరణించింది.
కర్నాటక సీఎం సిద్ధరామయ్య పరామర్శ..రూ.5 లక్షలు పరిహారం
సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. కారులో నుంచి వారు బయటకు రావడానికి స్థానికులు చీరలు, తాళ్లు విసిరారు. వాటిని పట్టుకుని కొందరు బయటకు వచ్చారు. ఆ కారు నీటిలో మునిగిపోకుండా కూడా వీటి ద్వారా పట్టుకోగలిగారు. మిగిలిన కొందరిని నిచ్చెన సహాయంతో బయటకు తీసుకువచ్చారు. వారిని వెంటనే సెయింట్ మార్థా హాస్పిటల్‌కు తరలించారు. బెంగళూరు ఆస్పత్రిని కర్నాటక సీఎం సిద్ధరామయ్య సందర్శించారు. భానురేఖ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు.
ధ్వంసమైన వాహనాలు..
భారీ వర్షం కారణంగా బెంగళూరు నగరంలోని నగరసౌధ, ఆనంద్‌రావు, మెజెస్టిక్, రేస్ కోర్స్, కేఆర్ సర్కిల్, టౌన్ హాల్, కార్పొరేషన్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, జయనగర్, మల్లీశ్వర్ ప్రాంతాలను వరద ముంచెత్తింది. పలు చోట్ల వాహనాలు రోడ్డు పక్కనే పార్కింగ్ చేయగా.. భారీ వృక్షాలు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి. రేస్ కోర్స్ రోడ్డుపై ఓ లగ్జరీ కారు నుజ్జునుజ్జయింది. కుమార్ కృపా రోడ్డులోని చిత్రకళా పరిషత్ ఎదురుగా కారు, బైక్ పై భారీ వృక్షం పడి వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.