అర్ధరాత్రి రోడ్డుపైనే మహిళ ప్రసవం..జడ్చర్లలో ఘటన

అర్ధరాత్రి రోడ్డుపైనే మహిళ ప్రసవం..జడ్చర్లలో  ఘటన

జడ్చర్ల టౌన్, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి, ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపైనే ఓ మహిళ ప్రసవించింది. ఈ ఘటన ప్రభుత్వ ఆసుపత్రికి కూతవేటు దూరంలోనే జరిగింది. వివరాల్లోకి వెళితే..నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచకు చెందిన యాదమ్మ నిండు గర్భిణి. కాన్పు కోసం ఆమె తన రెండేళ్ల కొడుకును వెంటబెట్టుకుని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి శనివారం వెళ్లింది. డెలివరీకి ఇంకా టైమ్ ఉందని డాక్టర్లు చెప్పారు. దాంతో యాదమ్మ..తాను చాలా దూరం నుంచి వచ్చానని, ఆస్పత్రిలోనే ఉండి కాన్పు అయ్యాక వెళ్తానని సిబ్బందిని కోరింది. అయితే, ఆస్పత్రి సిబ్బంది గర్భిణి విజ్ఞప్తిని పట్టించుకోకపోగా..ఆమెను బలవంతంగా బయటకు పంపించారు. దాంతో చేసేది లేక యాదమ్మ..పసివాడితో కలిసి ఆస్పత్రి పరిసరాల్లోనే ఉన్న గాంధీ విగ్రహం వద్ద చలిలో కూర్చుండిపోయింది.

ఈ క్రమంలోనే అర్ధరాత్రి దాటిన తర్వాత యాదమ్మకు సడన్ గా పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ టైమ్ లో అక్కడ ఎవరూ లేకపోవడంతో నడిరోడ్డు మీదనే ఆమె ప్రసవించింది. పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలి పరిస్థితిని చూసి చలించిపోయిన స్థానికులు ఆమెను ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్ర్పత్రి సిబ్బంది వెంటనే ట్రీ​ట్​మెంట్​ చేయడంతో తల్లీబిడ్డలు ఇద్దరికీ ఏమీకాలేదు. కాగా, ఓ గర్భిణి పట్ల డాక్టర్లు చూపిన నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు.