నల్గొండ జిల్లాలో దళితుడిని చెప్పుతో కొట్టిన మహిళా సర్పంచ్‌

నల్గొండ జిల్లాలో దళితుడిని చెప్పుతో కొట్టిన  మహిళా సర్పంచ్‌

నార్కట్​పల్లి, వెలుగు: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బాజకుంట గ్రామంలో దళితులపై మహిళా సర్పంచ్ దాడి చేసి చెప్పుతో కొట్టింది. దళితులు, గ్రామస్థుల వివరాల ప్రకారం బాజకుంట గ్రామంలో ఈ నెల 4న ఒకరి ఇంట్లో దేవతల పండుగ చేయడంతో కులవృతిలో భాగంగా డప్పులు కొట్టేందుకు దళితులు వెళ్లారు. పండుగ అయిపోయిన తర్వాత భోజనం చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో గ్రామానికి చెందిన సర్పంచ్​సరిత భర్త రవీందర్​రెడ్డి, కులస్తులు భోజనాలు చేస్తున్నారు. తాము భోంచేసిన తర్వాత రావాలని దళితులకు చెప్పడంతో వెళ్లిపోయి గంట తర్వాత వచ్చారు. అప్పటికీ అక్కడున్నవారి భోజనాలు పూర్తి కాలేదు. అప్పుడే వస్తారా అంటూ ఆగ్రహించిన రవీందర్​రెడ్డి, ఇంద్రారెడ్డి వారిపై దాడి చేశారు.

దీంతో దళితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో పెద్దల సమక్షంలో కేసు విషయం మాట్లాడుతుండగా మాపైన కేసు పెడతారా అంటూ సర్పంచ్ సరిత చెప్పుతో వికలాంగులైన దళితుడు పరశురాముపై దాడి చేసింది. దీంతో సర్పంచును అరెస్టు చేయాలంటూ దళితులు తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన సర్పంచ్, ఆమె భర్తపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. దళితుల రక్షణ కోసం గ్రామంలో పోలీస్ పికెటింగ్​ఏర్పాటు చేయాలని కోరారు. ధర్నాలో బాధితులతో పాటు బీసీ, దళిత సంఘాల నాయకులు పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, చిరుమర్తి లింగస్వామి, గోవర్థన్, నరేశ్, మధు తదితరులు పాల్గొన్నారు.