కల్యాణలక్ష్మి కోసం రూ. 9 వేలు ఇచ్చా

కల్యాణలక్ష్మి కోసం రూ. 9 వేలు ఇచ్చా

రామన్నపేట/వలిగొండ, వెలుగు: కల్యాణలక్ష్మి చెక్కు కోసం రూ. 9 వేలు లంచం ఇచ్చినట్లు ఓ మహిళ ఎమ్మెల్యేతో చెప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసులో గురువారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ చెక్కుల కోసం ఎవరికైనా లంచం ఇవ్వాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు.  చంద్రకళ అనే మహిళ తాను రూ. 9 వేలు ఇచ్చినట్లు పేర్కొంది. ప్రతి గ్రామంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని, ఎలాంటి లంచాలు ఇవ్వవద్దని ఎమ్మెల్యే సూచించారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తోందని, ఎవరైనా బ్రోకర్లకు లేదా తన వెంట ఉండే లీడర్లకు పైసలు ఇచ్చి మోసపోయినట్లయితే స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పాలన్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంద్రపాల నగరానికి చెందిన చంద్రకళ దగ్గర రూ. 9 వేల లంచం తీసుకున్న వ్యక్తి ఆ డబ్బులు ఆమెకు తిరిగి ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ ఆంజనేయులు వివరణ కోరగా తమ ఆఫీసులో సిబ్బంది, ఇంకెవరైనా లంచాలు తీసుకుంటున్నట్లు తన దృష్టికి వస్తే వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.