హైదరాబాద్ లో యూట్యూబ్​లో ఇన్వెస్ట్​మెంట్​పేరుతో మోసం

హైదరాబాద్ లో యూట్యూబ్​లో ఇన్వెస్ట్​మెంట్​పేరుతో మోసం
  •    మహిళ నుంచి రూ. 44 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

బషీర్​బాగ్, వెలుగు : యూట్యూబ్ వీడియోలపై ఇన్వెస్ట్ పేరుతో మహిళ నుంచి సైబర్ నేరగాళ్లు భారీగా డబ్బు కాజేశారు. సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ఓ మహిళకు టెలిగ్రామ్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను యూట్యూబ్​లో ఇన్వెస్ట్ మెంట్ బిజినెస్ చేస్తానని నమ్మించాడు. ఆమెకు ఓ లింక్​ను పంపించి రేటింగ్ ఇవ్వాలని కోరాడు. లింక్​ను ఓపెన్ చేసిన మహిళ రేటింగ్ ఇచ్చింది. యూట్యూబ్​లో వీడియోలపై ఇన్వెస్ట్​మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని సదరు వ్యక్తి ఆమెకు చెప్పాడు.

అతడి మాటలు నమ్మిన మహిళ మొదట రూ.11 వేలు ఇన్వెస్ట్ చేసింది. ఆ వ్యక్తి ఆమెకు లాభాలు పంపించాడు. దీంతో అతడి ట్రాప్​లో పడిపోయిన ఆమె పలు దఫాలుగా రూ.44 లక్షలు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత నుంచి లాభాలు ఇవ్వకపోగా.. ఇంకా ఇన్వెస్ట్ చేయాలంటూ ఆ వ్యక్తి ఒత్తిడి చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.