కేసు భయంతో మహిళ సూసైడ్‌‌.. మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఘటన

కేసు భయంతో మహిళ సూసైడ్‌‌.. మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఘటన

మెదక్ (చేగుంట), వెలుగు : తనపై కేసు పెట్టారన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. విలేజ్‌‌ సెక్రటరీ స్రవంతి, ఆశ వర్కర్ రామలక్ష్మి కలిసి ఈ నెల 4న గ్రామంలోని కొండి లక్ష్మి ఇంటికి వెళ్లారు. 

ఇంటి ముందు చెత్త ఉండడంతో దానిని తీసివేయాలని లక్ష్మికి సూచించగా.. ఆమె నిరాకరించింది. దీంతో సెక్రటరీ స్రవంతి తన ఫోన్‌‌తో ఫొటోలు తీస్తుండగా... ఆగ్రహానికి గురైన లక్ష్మి స్రవంతిపై దాడి చేయడంతో పాటు, ఆమె ఫోన్‌‌ను లాక్కొని నేలకేసి కొట్టింది. 

దీంతో స్రవంతి చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లక్ష్మిపై కేసు నమోదు చేశారు. దీంతో తనను స్టేషన్‌‌కు పిలుస్తారన్న భయంతో లక్ష్మి శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి మృతికి కారణమైన సెక్రటరీ స్రవంతి వచ్చే వరకు డెడ్‌‌బాడీని తరలించేది లేదని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు.