సభ్యసమాజం తలదించుకునే ఘటన: MLA ఫామ్‌హౌస్‌లో యువతిపై పోలీసుల గ్యాంగ్ రేప్

సభ్యసమాజం తలదించుకునే ఘటన: MLA ఫామ్‌హౌస్‌లో యువతిపై పోలీసుల గ్యాంగ్ రేప్

లక్నో: ఉత్తరప్రదేశ్‎లోని అమ్రోహా జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఆపదలో అండగా నిలవాల్సిన పోలీసులే ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలయాల సందర్శనకు తీసుకెళ్తామని మభ్యపెట్టి ఫామ్‎హౌస్‎లో ఈ నీచానికి ఒడిగట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

పోలీసుల వివరాల ప్రకారం.. హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్‎కు చెందిన 23 ఏళ్ల యువతిని ఓ మహిళ సంప్రదించి ఉచితంగా అమ్రోహాలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లాలనుకుంటే సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ మోహిత్‌ను కలవమని చెప్పింది. సదరు మహిళ మాటలు నమ్మిన యువతి సెప్టెంబర్ 21న సోనిపట్‌లో మోహిత్‌‎ను కలిసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మీరట్‌కు వెళ్లారు. అక్కడ సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ లాలారామ్ యాదవ్ వీరితో కలిశారు.

సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం మోహిత్, లాలారామ్ యాదవ్ ఆ మహిళను కారులో హసన్‌పూర్‌కు తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో ఉత్తర ప్రదేశ్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సంజయ్ తోమర్‌ను కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత ముగ్గురూ యువతిని అత్రాసి-హసన్‌పూర్ రహదారిపై ఉన్న ఒక ఫామ్‌హౌస్‌కు తీసుకువెళ్లారు. ఫామ్ హౌస్‎లో రెండు గదులను అద్దెకు తీసుకున్నారు. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రమోద్ ఆ ఫామ్‌హౌస్‌లో వీరికి ఫుడ్, లిక్కర్ ఏర్పాటు చేశాడు. 

మద్యం మత్తులో మోహిత్, లాలారామ్ యాదవ్, సంజయ్ తోమర్ తనపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారని ఆ మహిళ ఆరోపించింది. ఆ తర్వాత కానిస్టేబుల్ ప్రమోద్ గదిలోకి ప్రవేశించి తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని.. అయితే తాను అతడిని బయటకు నెట్టివేసి తలుపు గడియ పెట్టానని ఆమె పోలీసులకు తెలిపింది. 

అనంతరం డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. హసన్‌పూర్, రాజబ్‌పూర్ పోలీస్ స్టేషన్ల బృందాలు ఫామ్‌హౌస్‌కు చేరుకుని బాధితురాలిని రక్షించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్‎కు తరలించారు. 

సబ్-ఇన్‌స్పెక్టర్ సంజయ్ తోమర్‌, హెడ్ కానిస్టేబుల్ ప్రమోద్‎ను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు  ఎస్పీ లఖన్ సింగ్ తెలిపారు. ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు చెప్పారు. యువతిపై అత్యాచారం జరిగిన ఫామ్ హౌస్ ఓ ఎమ్మెల్యేకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. పరిపాలన నేరంపై ఆధారపడినప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అవినీతిమయం అవుతుందని విమర్శించారు. ఈ ఘటన పోలీస్ శాఖకు ఒక మచ్చ అని అభివర్ణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.