ఫైనాన్షియల్​ నాలెడ్జ్​ని పంచే యూట్యూబ్​ ఛానెల్

ఫైనాన్షియల్​ నాలెడ్జ్​ని పంచే యూట్యూబ్​ ఛానెల్

చాలామంది డబ్బు సంపాదిస్తుంటారు. కానీ.. వాళ్లలో కొందరే పొదుపు చేసుకోగలుగుతారు. చాలా తక్కువమంది మాత్రమే ఇన్వెస్ట్​ చేయగలుగుతారు. దీనికి కారణం.. వాళ్లకు డబ్బును ఎలా దాచాలో తెలియకపోవడమే. అందుకే రచనా రనాడే ఫైనాన్షియల్​ నాలెడ్జ్​ని పంచడానికే యూట్యూబ్​ ఛానెల్​ పెట్టింది. ఫైనాన్షియల్​ అడ్వైజర్లు డబ్బులు తీసుకుని ఇచ్చే సలహాలను ఈమె ఫ్రీగా ఇస్తోంది. 

రచనా రనాడే మహారాష్ట్రలోని పుణెలో పుట్టి, పెరిగింది. ఆమె ఒక సక్సెస్​ఫుల్​ యూట్యూబర్​ మాత్రమే కాదు.. ఎంట్రప్రెనూర్​, చార్టర్డ్ అకౌంటెంట్, ఒక మంచి టీచర్​ కూడా. అంతేకాదు.. ఆడిటింగ్ రంగంలో పదేండ్ల కంటే ఎక్కువ అనుభవం ఉందామెకు. రచన 2015లో ‘‘సీఏ రచనా ఫద్కే రనాడే” పేరుతో యూట్యూబ్​ ఛానెల్​ మొదలుపెట్టింది. ఇందులో స్టాక్​ మార్కెట్​, ఫైనాన్స్, రాబోయే ఐపీవోలు​, మార్కెట్ ట్రెండ్స్​, డబ్బును ఎలా సేవ్​ చేసుకోవాలి? ఎలా ఇన్వెస్ట్​ చేయాలి?.. లాంటి అంశాల మీద వీడియోలు చేసి అప్​లోడ్ చేస్తోంది. మార్కెట్​లో వచ్చే ప్రతి​ అప్​డేట్​ గురించి వీడియోల్లో చెప్తుంటుంది. రచన అభినవ విద్యాలయ ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్​లో చదువుకుంది. తర్వాత బీకామ్​ (స్టాటిస్టిక్స్)లో బ్యాచిలర్ డిగ్రీ  చదివేందుకు బృహన్ మహారాష్ట్ర కాలేజ్ ఆఫ్ కామర్స్​కు వెళ్లింది. 2008లో ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరింది. అక్కడ చదువు పూర్తయ్యాక సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్​లో పీజీ డిప్లొమా చేసింది. ఆ తర్వాత యూట్యూబ్​లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె ఛానెల్​కు 40 లక్షల మందికి పైగా సబ్​స్క్రయిబర్స్​ ఉన్నారు. అయితే.. రచన ఛానెల్​ పెట్టిన కొత్తలో రీచ్​ ఎక్కువగా రాలేదు. వీడియోలకు చాలా తక్కువ వ్యూస్​ వచ్చేవి. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు అందరూ ఇండ్లకే పరిమతమయ్యారు. పైగా చాలామంది ఫ్యూచర్​ గురించి ఆలోచించి ఇన్వెస్ట్​మెంట్ గురించి తెలుసుకోవాలి అనుకున్నారు. ముఖ్యంగా ఐపీవోలు, షేర్లు, మ్యూచ్​వల్ ఫండ్స్​లో పెట్టుబడులు లాంటి వాటి గురించి తెలుసుకునేందుకు యూట్యూబ్​లో సెర్చ్​ చేశారు. అలా రచన ఛానెల్​లోని వీడియోలు చాలామంది చూశారు. అందుకే కరోనా టైంలో ఛానెల్​ చాలా పాపులర్​ అయింది. 

టీచర్​ 

యూట్యూబ్​లోనే కాదు.. ఇనిస్టిట్యూట్​లో పిల్లలకు కూడా ఆమె పాఠాలు చెప్తుంటుంది. తన చదువు పూర్తయినప్పటి నుంచి పుణెలోని ఎక్స్​పర్ట్​ ప్రొఫెషనల్​ అకాడమీలో క్లాసులు చెప్తోంది. సీఏ ఐపీసీసీ, డిగ్రీ ఫైనల్​ ఇయర్​ స్టూడెంట్స్​కి ఆడిట్ సబ్జెక్ట్​ నేర్పిస్తోంది. రచన క్లాస్​లకి ఆఫ్​లైన్​లో దాదాపు పదివేల మంది, ఆన్​లైన్​లో దాదాపు లక్ష మంది స్టూడెంట్స్​ అటెండ్​ అయ్యారు. 

వెబ్‌సైట్, స్టోర్

రచన www. rachanaranade.com అనే వెబ్​సైట్​ కూడా నడుపుతోంది. ఇది ఫైనాన్స్ గురించి నేర్చుకోవాలి అనుకునేవాళ్లకు బెస్ట్​ చాయిస్​. ఈ వెబ్‌సైట్‌లో ఎన్నో ఫైనాన్స్​ బ్లాగులు ఉన్నాయి. చాలా కోర్సులు కూడా ఉన్నాయి. దీంతోపాటు రచన ఒక ఆన్​లైన్ స్టోర్​ని కూడా నడుపుతోంది. అందులో కొన్ని రకాల ప్రొడక్ట్స్​  అమ్ముతోంది. ముఖ్యంగా టీ షర్ట్స్​, డైరీ పవర్​ బ్యాంక్​లు అమ్ముతోంది. అందుకోసం ప్రత్యేకంగా funance.store అనే వెబ్​సైట్​ని నడుపుతోంది. 

నెట్​వర్త్​

యూట్యూబ్​ ఛానెల్​తోపాటు క్లాస్​లు చెప్పడం, ఆన్​లైన్​ స్టోర్​ నుంచి రచనకు ఆదాయం వస్తోంది. వీటి ద్వారా ఆమె నెలకు సుమారు 10 లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తోంది. ప్రస్తుతం ఇప్పటివరకు ఆమె 5 కోట్లకు పైగానే సంపాదించింది.