Aadarsha Kutumbam కథ.. ‘బ్లాస్ట్’ సినిమాలా ఉంటుందా? క్లారిటీ ఇదే..

Aadarsha Kutumbam కథ.. ‘బ్లాస్ట్’ సినిమాలా ఉంటుందా?  క్లారిటీ ఇదే..

విక్టరీ వెంకటేష్–మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’పై ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. ఈ సినిమా అక్టోబర్ 9న రిలీజ్ కానుంది. అక్టోబర్ 6న ట్రైలర్, అక్టోబర్ 7 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై క్యూరియాసిటీని భారీగా పెంచింది. అయితే, ఈ సినిమా కథ.. మరో బ్లాక్ బస్టర్ సినిమాని పోలి ఉందనే రూమర్స్ ఊపందుకున్నాయి. మరి ఇందులో నిజమెంత? మరి ఆ సినిమా ఏంటనేది చూసేద్దాం.. 

‘బ్లాస్ట్’తో పోలికలు.. అసలు విషయం ఏమిటి?

‘ఆదర్శ కుటుంబం’ కథ విషయంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తమిళంలో ఈ ఏడాది విడుదలైన ‘బ్లాస్ట్’ సినిమాతో AK 47 కథకు పోలికలు ఉన్నాయనే ప్రచారం గతంలోనే సోషల్ మీడియాలో మొదలైంది.

‘బ్లాస్ట్’ కథని గుర్తుచేసుకుంటే.. సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా ఒక క్రిమినల్ నెట్‌వర్క్‌కు ఎదురుగా నిలబడుతుంది. కుటుంబం ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో బయట నుంచి వచ్చిన శక్తులు వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ ఊహించని విధంగా పరిస్థితులను ఎదుర్కొంటుంది. 

ఇక ఆ క్రిమినల్స్ పై ఫ్యామిలీ ఎలా తిరగబడింది? అనేదే బ్లాస్ట్ కథ. దీంతో త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్‌ను కొంతకాలం ఆపి స్క్రిప్ట్‌లో మార్పులు చేశారనే రూమర్స్ కూడా అప్పట్లో వినిపించాయి. 

‘బ్లాక్ స్వాన్’.. త్రివిక్రమ్ ఇచ్చిన అసలు క్లూ ఇదే!

ఇటీవల ప్రమోషనల్ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ కథను వివరించేటప్పుడు ‘బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్’ గురించి ప్రస్తావించారు. త్రివిక్రమ్ చెప్పిన దాని ప్రకారం.. రెండు వర్గాల మధ్య ఒక గేమ్ జరుగుతుంటే, ఆ పోరాటంతో సంబంధం లేని వ్యక్తులు కూడా దాని ప్రభావానికి గురవుతారు. అంతేకాదు.. మనం అన్ని విషయాలను ప్లాన్ చేసుకున్నామని అనుకున్న సమయంలో ఊహించని మూల నుంచి ఒక పరిణామం వచ్చి మొత్తం పరిస్థితిని తారుమారు చేయడమే ‘బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్’ అని ఆయన వివరించారు.

ఇదే కాన్సెప్ట్‌ను ‘ఆదర్శ కుటుంబం’ కథకు వర్తింపజేస్తే.. సినిమా అసలు పాయింట్‌పై ఒక ఆసక్తికరమైన అంచనా ఏర్పడుతుంది. ఒకవైపు తమ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లే రెండు శక్తులు.. మరోవైపు వాటి మధ్యలో చిక్కుకునే ఒక సాధారణ కుటుంబం. ఆ కుటుంబం కథలోకి అనుకోకుండా వచ్చిన ఒక వ్యక్తి లేదా సంఘటన.. అప్పటివరకు ఉన్న గేమ్ మొత్తాన్ని మార్చేయడం. ఇదే నిజంగా సినిమా కథ అయితే.. టీజర్‌లో కనిపించిన అప్పుల కుటుంబం నుంచి భారీ బంగ్లా వరకు జరిగిన మార్పు కూడా కేవలం కామెడీ ట్రాక్ కాదనే అనిపిస్తుంది.

‘బ్లాస్ట్’లా ఉంటుందా? లేక త్రివిక్రమ్ మార్క్ కొత్త కథనా?

‘బ్లాస్ట్’తో ‘ఆదర్శ కుటుంబం’కు పోలికలు ఉన్నాయనే రూమర్ ఒకవైపు.. త్రివిక్రమ్ చెప్పిన ‘బ్లాక్ స్వాన్’ కాన్సెప్ట్ మరోవైపు ఉన్నాయి. పైగా టీజర్ కూడా ఒక సాధారణ కుటుంబం కథలా మొదలై.. చివరికి డార్క్ మిస్టరీని చూపించింది. కాబట్టి బయటకు కనిపిస్తున్న కొన్ని అంశాల ఆధారంగా రెండు సినిమాలను పోల్చడం సులభమే. కానీ కథలోని పాత్రలు, సంఘర్షణ, ట్విస్టులు, క్లైమాక్స్ వంటి అసలు అంశాలు బయటకు రాకుండా ఇప్పుడే ‘ఇదే కథ’ అని చెప్పడం మాత్రం తొందరపాటు అవుతుంది.

ఎందుకంటే త్రివిక్రమ్ చెప్పిన ‘బ్లాక్ స్వాన్’ పాయింట్‌లోనే సినిమాకు.. అసలు ట్విస్ట్ దాగి ఉండే అవకాశం ఉంది. మనం ఊహిస్తున్నది ఒకటైతే.. సినిమా మరో దిశలో వెళ్లేలా ఆయన స్క్రీన్‌ప్లేను డిజైన్ చేసి ఉండొచ్చు. మొత్తానికి.. అప్పులతో మొదలయ్యే ఒక సాధారణ కుటుంబం జీవితంలోకి ఒక ఊహించని వ్యక్తి లేదా సంఘటన ఎంట్రీ ఇస్తే.. ఆ తర్వాత ఆ కుటుంబం ఎలా మారుతుంది? అన్నదే ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం’పై ఉన్న అతిపెద్ద ప్రశ్న.

వెంకటేష్ తన కామెడీతో ఆ కుటుంబానికి ప్రాణం పోస్తే.. త్రివిక్రమ్ తన మాటలతో ఆ ప్రపంచాన్ని నిర్మించబోతున్నారు. దానికి క్రైమ్, యాక్షన్, ఎమోషన్, ‘బ్లాక్ స్వాన్’ ట్విస్ట్ జతైతే.. ‘ఆదర్శ కుటుంబం’ అసలు ఏ జానర్‌లోకి వెళ్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ‘బ్లాస్ట్’ పోలికలు నిజమా? లేక త్రివిక్రమ్ తనదైన స్టైల్లో పూర్తిగా కొత్త కథను చెప్పారా? హౌస్ నెం.47లో దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి? అన్నదానికి సమాధానం అక్టోబర్ 9న థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాతే పూర్తిగా తెలుస్తుంది.