
Bihar Voter Revision Row: దేశంలో ట్రైన్ టిక్కెట్ పొందటం నుంచి ప్రభుత్వం అందించే వివిధ స్కీమ్స్, సబ్సిటీలను అందుకోవాలన్నా అన్నింటికీ ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే ఆధార్ చాలా సందర్భాల్లో గుర్తించదగిన పత్రంగా చూస్తున్నప్పటికీ ప్రస్తుతం.. బీహార్ ఓటర్ల వివాదంలో దీని ప్రామాణికతపై పెద్ద చర్చ కొనసాగుతోంది.
ప్రస్తుతం బీహార్ ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం అంగీకరించబడే గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్‌ను మినహాయించడంపై వివాదం రాజుకుంది. అయితే దీనిపై యూఐడీఏఐ సీఈవో భువనేష్ కుమార్ స్పందిస్తూ.. ఆధార్ ఎప్పుడూ మెుదటి గుర్తింపు కాదని చెప్పారు. రోజురోజుకూ పెరుగుతున్న నకిలీ ఆధార్ దందాను తనిఖీ చేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి ఆయన హైలైట్ చేశారు. ప్రస్తుతం ప్రజలకు జారీ చేయబడిన ఆధార్ కార్డులకు ఒక ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుందని, అందులో అంతర్నిర్మిత భద్రతా యంత్రాంగం ఉంటున్నారు కుమార్.
నకిలీ ఆధార్ కార్డులను గుర్తించేందుకు వీలుగా యూఐడీఏఐ అభివృద్ధి చేసిన ఆధార్ క్యూఆర్ స్కానర్ యాప్ దోహదపడుతుందని భువనేష్ చెప్పారు. కొత్త ఆధార్ యాప్ అభివృద్ధి చివరి దశలో ఉందని UIDAI చీఫ్ వెల్లడించారు. ఈ కొత్త యాప్ ద్వారా ప్రజలు తమ ఆధార్ కార్డుల భౌతిక కాపీలను పంచుకోవాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ప్రజలు వారి సమ్మతిని బట్టి వారి ఆధార్ వివరాలను పూర్తి లేదా మాస్క్డ్ ఫార్మాట్‌లో పంచుకోవడానికి వీలుంటుందన్నారు.
జూన్ 24న EC జారీ చేసిన ఆదేశం ప్రకారం, జూలై 25 నాటికి బీహార్‌లోని దాదాపు ఎనిమిది కోట్ల మంది ఓటర్లను జాబితాలో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనర్హుల పేర్లను తొలగించి, అర్హులైన పౌరులను మాత్రమే జాబితాలో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీహార్ లో ఆధార్, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డులను గుర్తింపు రుజువుగా అంగీకరించకపోవడంతో ఓటర్లు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ కమిషన్ ఆధార్ కార్డులను ఓటర్ కార్డులతో లింక్ చేయాలని భావిస్తున్న ప్రస్తుత సమయంలో యూఐడీఏఐ సీఈవో చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారితీయటం గమనార్హం.
ప్రస్తుతం బీహార్ ఎన్నికల ఓటర్ రివిజన్ ప్రక్రియలో దేశవ్యాప్తంగా గుర్తింపు రుజువుగా ఉపయోగించే పత్రాలైన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లను పరిగణించకోవటంపై దుమారం కొనసాగుతోంది.