
- సేవ, సంకల్పం, సమర్పణ నినాదాలతో అమలు
- మండల స్థాయిలో టీమ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్
- కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో పర్యవేక్షణ
భద్రాచలం, వెలుగు : గిరిజన సంక్షేమం, విద్య, వైద్యం, ఫారెస్ట్ , ఉమెన్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్, రూరల్ వాటర్ డిపార్ట్మెంట్ శాఖల ఆఫీసర్లతో కూడిన టీమ్ ఇకపై గ్రామాల్లోకి వెళ్లి ఆదివాసీలకు మౌలిక సదుపాయాల కల్పనకు యాక్షన్ ప్లాన్ తయారు చేయనున్నది. ఈ మేరకు మండలాల వారీగా టీంలను ఏర్పాటు చేసి వారికి మూడు రోజుల పాటు ఐటీడీఏలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి.రాహుల్పర్యవేక్షణలో మంగళవారం నుంచి మాస్టర్ ట్రైనీలు ఎంపిక చేసిన ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు.
మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్ ‘ఆది కర్మయోగి అభియాన్’ అనే ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ట్రైనింగ్ తీసుకున్న వీరంతా ఈనెల 9,10న గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లోని ఎన్జీవోల సాయంతో వ్యక్తిగత, కమ్యూనిటీపరంగా బెనిఫిట్స్ గురించి గిరిజన ప్రజలకు వివరించి, వారి సంక్షేమానికి పాటుపడేలా కృషి చేస్తారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 19 మండలాల్లో 130 గ్రామాల్లో పక్కాగా ఈ ప్రోగ్రాం నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ను రూపొందించారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను గిరిజనుల కోసం అమలు చేస్తున్నాయి. కానీ అవి వారికి సరిగ్గా అందడం లేదనే కారణంతో అందరికీ ప్రభుత్వ పథకాలు అనే లక్ష్యంతో ఆది కర్మయోగి అభియాన్ ను డిజైన్ చేశారు. గిరిజన కుటుంబాలు వారి ఆచారాలు, జీవనశైలి, పద్దతులు చాలా పురాతనంగా ఉంటాయి. అడవిని వదిలి బయటకు రావడానికి వారు ఇష్టపడరు. ఉన్న ఊరిలోనే ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా లబ్ధిపొందేలా ఈ ప్రోగ్రామ్ ద్వారా గిరిజనులను చైతన్యపరుస్తారు.
గ్రామంలోని గిరిజన యువకులు,మహిళలతో గ్రామంలో, పొలాల గట్ల వెంట గ్రామసభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం, లైవ్లీఉడ్, ఫారెస్ట్ , మంచినీరు, మేకల పెంపకం, మునగ చెట్ల సాగు, అంగన్వాడీ, పాఠశాల భవనాలు, జీవితబీమా, ఆది సురక్ష భీమా వంటి పథకాలు గిరిజనులకు తెలియజేసి, అక్కడికక్కడే వారి నుంచి దరఖాస్తు రాయించుకుని అమలు చేసేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే గిరిజన పల్లెల్లో టూరిజం, అటవీ ఉత్పత్తులతో వస్తువులు, పిండి పదార్థాలు, చిరుధాన్యాలతో తినుబండారాలు, మిల్లెట్ బిస్కెట్లు, విప్పలడ్డూలు, స్థానికంగా దొరికే వస్తువులతో పచ్చళ్లు, సోప్స్ ఇలా రకాలుగా ఆదివాసీలు తయారు చేసి విక్రయిస్తున్నారు.
ఇటువంటి వారికి బాసటగా నిలిచేలా కూడా ట్రైనింగ్ పొందిన వారు చైతన్యపరచాలని కలెక్టర్, పీవోలు వివరించారు. మాస్టర్ ట్రైనర్లు చెప్పినవి శ్రద్ధగా విని గ్రామాల్లో ఆదివాసీ యువకులు, మహిళలను వివరించి వారిలో ప్రేరణ కల్గించడం, వాటిని ఫొటోలు, వీడియోలు తీయడం తప్పని సరిగాచేయాలని వారు సూచించారు. ఈ ప్రోగ్రామ్ను ట్రైనింగ్ పొందిన ఆఫీసర్లు లక్ష్యాన్ని ఆదివాసీల చెంతకు తీసుకెళ్తే ఈ ఆదికర్మయోగి అభియాన్ వరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.