- మరాఠీతోపాటు ఇతర భాషలకూ జై
- స్ట్రాటజీ మార్చుకున్న శివసేన
ముంబై: మరాఠావాదమే ఊపిరిగా పురుడుపోసుకున్న శివసేన పార్టీ తన53 ఏండ్ల జర్నీలో తొలిసారి ఇతర భాషల్నీ కలుపుకునే ప్రయత్నం చేసింది. శివసేన పార్టీకి మరాఠీల హక్కులే ముఖ్యమని అప్పట్లో బాల్థాక్రే నినాదమిస్తే, ఇప్పుడాయన మనవడు, ఆదిత్య థాక్రే మాత్రం అన్ని భాషలవాళ్లూ మావాళ్లేనని సంకేతాలిచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వర్లీ స్థానం నుంచి పోటీచేస్తోన్న ఆదిత్య.. తెలుగు సహా ఇతర భాషల్లో ప్రచారం చేస్తున్నారు. వర్లీ ఏరియాలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకోడానికి ఆయన ‘‘నమస్తే వర్లీ’’అంటూ పలకరించారు. గుజరాతీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో గుజరాతీ భాషలో, ముస్లిం మెజార్టీ ఏరియాల్లో ఉర్దూలో హోర్డింగ్లు ఏర్పాటుచేశారు. 29 ఏండ్ల ఆదిత్యా థాక్రేను సీఎం క్యాండేట్ రేసులో నిలబెట్టాలనుకుంటున్న శివసేన.. తన స్ట్రాటజీ మారిందని చెప్పుకునే ప్రయత్నమే ఈ పోస్టర్ల ఏర్పాటని అనలిస్టులు అభిప్రాయపడ్డారు. మొత్తంగా గాంధీ జయంతి నాడు నిద్రలేచిన ముంబైకర్లకు ఇది ఊహించని మార్పు.

