మిస్టర్ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్ కీలక నిర్ణయం 

మిస్టర్ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్ కీలక నిర్ణయం 

బాలీవుడ్‌ మిస్టర్ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించిన 'లాల్‌సింగ్‌ చడ్డా’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో ఈ మూవీ భారీ నష్టాలను మూటగట్టుకుంది.  ఆ నష్టాన్ని ఆమిర్‌ ఖాన్‌ భరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నష్టాన్ని తగ్గించడానికి తన పారితోషికాన్నీ కూడా వదులుకోనున్నట్లు బాలీవుడ్ లో వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ‘లాల్‌ సింగ్ చడ్డా’ మొత్తం బడ్జెట్‌ రూ.180 కోట్లు. ఆమిర్‌, అతడి మాజీ భార్య కిరణ్‌రావ్‌ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీ కోసం గత నాలుగేళ్లుగా మరే చిత్రాన్నీ ఆమిర్‌ ఖాన్ అంగీకరించలేదు. ‘విక్రమ్‌ వేద’ లాంటి సినిమాలను కూడా వదులుకున్నారు. ఆగస్టు 11న విడుదలైన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను మెప్పించలేక విఫలమైంది.  తొలి రోజు నుంచి నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో రెండో రోజు నుంచే థియేటర్స్‌ అన్ని ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇప్పుడు ఆ చిత్రం మిగిల్చిన నష్టాలను పూడ్చడానికి ఆమిర్‌ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమాకు ఆమిర్‌ రెమ్యూనరేషన్‌ రూ.50కోట్లు కాగా, ఇప్పుడు ఆ మొత్తం సొమ్ముని వదులుకుని నిర్మాతలకు నష్టాన్ని తగ్గించాలనుకుంటున్నారట. ఈ నిర్ణయంతో ఆమిర్‌కు ఈ మూవీపై మొత్తం రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇప్పటివరకు ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ కనీసం రూ.100కోట్ల వసూళ్లను కూడా అందుకోలేదని బాక్సాఫీస్‌ వర్గాలు చెబుతున్నాయి. గత 10 ఏళ్లలో ఆమిర్‌ చిత్రమేది రూ.వందకోట్ల మార్కుని అందుకోకుండా లేదు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఇప్పటివరకు రూ.70 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టినట్లు సమాచారం. అద్వెత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. యువనటుడు అక్కినేని నాగ చైతన్య  కీలక పాత్ర పోషించాడు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్ పతాకంపై  ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.