ఓట్చోరీని కప్పిపుచ్చేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది

ఓట్చోరీని కప్పిపుచ్చేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది
  • ఢిల్లీ నియోజకవర్గంలో 'ఓట్ల తొలగింపు'పై ఆప్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో "ఓట్ల దొంగతనం" ఆరోపణలను ఆమ్​ఆద్మీ పార్టీ మరోసారి తెరమీదకు తెచ్చింది. ఎన్నికల కమిషన్.. అక్రమాలను కప్పిపుచ్చుతోందని, ఓటర్ల తొలగింపుపై సమాచారాన్ని దాచిపెడుతోందని పేర్కొంది. శనివారం ఆప్ ఢిల్లీ యూనిట్ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ మధ్య పోటీ జరిగిన హై-ప్రొఫైల్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో తమ పార్టీ ఓట్ల చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు.

 "ఓటరు తొలగింపు కేసులపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల కమిషన్‌కు మేము లేఖలు కూడా సమర్పించామని.. కానీ, తాము కోరిన సమాచారం ప్రజా కార్యకలాపాలకు సంబంధించినది కాదని ఆర్టీఐ కింద సమాధానం ఇచ్చారని  పేర్కొన్నారు. ఇది ప్రధాన ఎన్నికల కమిషనర్ పాత్ర అనుమానాస్పదంగా ఉందని స్పష్టం చేస్తోందని, ఓట్ల దొంగతనాన్ని కప్పిపుచ్చడానికి మొత్తం కమిషన్ ప్రయత్నిస్తోందని భరద్వాజ్ ఆరోపించారు. 

కాగా, శనివారం సౌరభ్ భరద్వాజ్ నిర్వహించిన ప్రెస్​కాన్ఫరెన్స్​తర్వాత.. సీఈఓ/డీఈఓ నివేదికలతో సహా ఏడు అనుబంధాలతో కూడిన 76 పేజీల వివరణాత్మక సమాధానాన్ని ఎలక్షన్​ కమిషన్​ఆఫ్​ ఇండి జనవరి  13న అప్పటి ఢిల్లీ సీఎం అతిశీకి పంపినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలోని 40 సెగ్మెంట్ల ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులపై అతిశీ జనవరిలో రెండు లేఖలు రాశారని.. ఒకటి జనవరి 5న, మరొకటి జనవరి 9న రాశారని ఈసీ  తెలిపింది.