గోవా కోసం ఆప్ భారీ ప్లాన్స్

గోవా కోసం ఆప్ భారీ ప్లాన్స్
  • లోకల్ పార్టీలతో జతకడుతున్న ప్రధాన పార్టీలు
  • ఒంటరిగా బరిలోకి దిగిన అధికార బీజేపీ

పనాజీ: ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్దీ గోవాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.  పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని దెబ్బకొట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతాయని అనుకున్నా.. పొత్తులు పొడవక ప్రధాన పార్టీలు లోకల్ పార్టీలతో జట్టుకట్టి బరిలోకి దిగుతున్నాయి. దీంతో గోవాలో బహుముఖ పోటీ నెలకొంది. ప్రధాన పార్టీలైన తృణమూల్, ఆప్, ఎన్సీపీ, శివసేన పొత్తులు ఫెయిలైన తర్వాత బీజేపీకి దీటుగా నిలిచేది కాంగ్రెస్ మాత్రమేనని అక్కడి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత రెండు టర్ముల ఎలక్షన్ రిజల్ట్స్​ పరిశీలిస్తే 40 అసెంబ్లీ సీట్లున్న గోవాలో 2017 ఎన్నికల్లో బీజేపీ 13 చోట్ల గెలిచింది. అత్యధికంగా 32.48% ఓట్లను సాధించగా, కాంగ్రెస్ 28.35% ఓట్లతో 17 సీట్లు గెలుచుకుంది. ఓటింగ్ పర్సెంటేజీ పరంగా మహారాష్ట్రవాడి గోమంతక్ పార్టీ(ఎంజీపీ) 11.27% ఓట్లు సాధించి మూడు సీట్లు గెలుచుకోగలిగింది. మొత్తం 58 మంది ఇండిపెండెంట్లు పోటీ చేయగా.. 11.12% ఓట్లు సాధించి మూడు చోట్ల విజయం సాధించారు. 

గోవా కోసం ఆప్ భారీ ప్లాన్స్
గోవా కోసం భారీ ప్లాన్స్ చేసి, అమిత్ పాలేకర్‌‌ను సీఎంగా ప్రకటించిన ఆప్.. 2017 ఎన్నికల్లో 6.27% ఓట్లను సాధించినా ఖాతా తెరవలేదు. పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 2.28% ఓటింగ్ షేర్​తో ఒక్క సీటు గెల్చుకుంది. శివసేన గత ఎన్నికల్లో కేవలం 0.09% ఓట్లను మాత్రమే సాధించగలిగింది. అటు ఎన్సీపీ, శివసేన జట్టుకట్టడం దాదాపు ఖరారైనట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. శివసేన కూటమిని గెలిపిస్తే గోవాలో రియల్ ఎస్టేట్ మాఫియాకు చెక్ పెట్టొచ్చన్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న  కాంగ్రెస్ గోవాలో మాత్రం గోవా ఫార్వర్డ్ పార్టీతో కలిసింది. టీఎంసీ పార్టీ ఎంజీపీతో పొత్తు పెట్టుకుంది. అటు అధికార బీజేపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది.

తృణమూల్ వల్ల కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి..
ప్రధాన పార్టీల పొత్తులపై మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ గోవా ఎన్నికల ఇంచార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ బీజేపీకి తలనొప్పి కాలేదని.. కాంగ్రెస్, గోవాలకు తలనొప్పి అని కామెంట్స్ చేశారు. ఇక, 2012 ఎన్నికల్లో బీజేపీకి 34.68%, కాంగ్రెస్ 30.78%, ఎంజీపీ 6.72%, ఎన్‌‌సీపీ 4.08%, ఇండిపెండెంట్లు 16.67%, శివసేన 0.02% ఓట్లు సాధించాయి.