రాజ్యసభ బరిలో స్వాతి మాలివాల్

రాజ్యసభ బరిలో స్వాతి మాలివాల్
  • ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ ను నిలబెట్టిన ఆప్

న్యూఢిల్లీ :  ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్​ను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ రాజ్యసభ ఎంపీలు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాకు రెండోసారి అవకాశం ఇచ్చింది. ఢిల్లీలో మూడు రాజ్యసభ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, సుశీల్ కుమార్ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఈ మూడు స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ తమ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది.

సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాను వరుసగా రెండోసారి కొనసాగిస్తున్నామని.. అఫైర్స్ కమిటీ ప్రకటనలో పేర్కొంది. హర్యానా ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని సుశీల్ కుమార్ గుప్తా నిర్ణయించుకున్నారని, అందుకే ఆయన స్థానంలో స్వాతి మాలివాల్ ను నిలబెడుతున్నామని చెప్పింది. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ పదవికి స్వాతి మాలివాల్ రాజీనామా చేశారు. కాగా, ప్రస్తుతం జైలులో ఉన్న  సంజయ్ సింగ్ నామినేషన్ వేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సంజయ్ సింగ్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో రాజ్యసభకు రీనామినేషన్ వేసేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. విచారించిన స్పెషల్ జడ్జీ ఎంకే నాగ్ పాల్ ఈమేరకు అనుమతిస్తూ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.