దేశంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి సౌతిండియానే కీలకం ! తమిళనాడులో ఇది మంచి అవకాశం

దేశంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి సౌతిండియానే కీలకం ! తమిళనాడులో ఇది మంచి అవకాశం

చారిత్రాత్మకంగా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్‌‌‌‌కు దక్షిణ భారతదేశంతో ప్రత్యేక అనుబంధం ఉంది. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి చెందిన చాలా గొప్ప నాయకులు ఉన్నారు.  కామరాజ్ నాడార్,  తమిళనాట రాజాజీ, కర్నాటకకు చెందిన నిజలింగప్ప.  దేవరాజ్ అర్స్,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు సంబంధించి  నీలం సంజీవ రెడ్డి,  తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు వంటి దిగ్గజ నాయకులు ఎంతోమంది ఉన్నారు. 

భారతదేశంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ,  ఆయా రాష్ట్రాలకు చెందిన  ప్రాంతీయ పార్టీలు ఉత్తర, పశ్చిమ, తూర్పు భారతదేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.  దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ బలంగా ఉండేది,  తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో తప్ప ఆంధ్రప్రదేశ్​లో కాంగ్రెస్​ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.

మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌‌‌‌గఢ్,  హర్యానా,  హిమాచల్ ప్రదేశ్,  ఉత్తరాఖండ్,  రాజస్తాన్,  గుజరాత్ వంటి  రాష్ట్రాలలో బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలే  ప్రధానంగా ఉన్నాయి. ప్రస్తుతం లోక్​సభలో కాంగ్రెస్ పార్టీయే  ప్రధాన ప్రతిపక్షం అనేది నిజం. కానీ,  ప్రతిపక్షం నుండి  ఆ స్థాయిని దాటి అధికారం  సాధించి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే చాలాదూరం  ప్రయాణించాలి. అధికారం కైవసం చేసుకోవాలని కేవలం  కలలు  మాత్రమే ఢిల్లీని స్వాధీనం చేసుకోవడానికి సరిపోవు. 

ఇటీవల బిహార్  అసెంబ్లీ ఎన్నికలలో  కాంగ్రెస్‌‌‌‌కు పరాభవం తర్వాత దక్షిణాది కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి  ఏకైక బలమైన కోటగా మారింది. తెలంగాణ,  కర్నాటక  రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కలిగి ఉంది. ఈ  రెండు రాష్ట్రాల్లో  సాంప్రదాయకంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలమైనది. పార్టీ  నాయకులు  రాజకీయాల్లో  చురుకుగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఇకముందు  రాజకీయాల్లో తన మనుగడను కొనసాగించాలంటే ఆ పార్టీ ఇక నుంచి దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించాలి. 

దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పాత్ర

కేరళ: కాంగ్రెస్ ఒక పెద్ద కూటమికి నాయకత్వం వహిస్తోంది.  కేరళలో ప్రతిపక్షంగా ఉంది. 2024 పార్లమెంటు  ఎన్నికల్లో  కాంగ్రెస్ కూటమి 20 లోక్‌‌‌‌సభ  ఎంపీలలో 17 మందిని గెలుచుకుంది. కేరళ అసెంబ్లీ  ఎన్నికలు 2026లో  జరగనున్నాయి.  కాంగ్రెస్   కేరళను  గెలుచుకుంటుందని పలువురు రాజకీయవేత్తలు భావిస్తున్నారు. కానీ,  కాంగ్రెస్‌‌‌‌కు  ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే హిందువులు హస్తం పార్టీకి దూరమై బీజేపీకి చేరువ అవుతున్నారు. ఆ ప్రవాహానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్ట వేయాలి.

కర్నాటక: కాంగ్రెస్ పార్టీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో  గెలిచి అధికారాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం కర్నాటకలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఉంది.  కానీ,  కర్నాటక ప్రజలు సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి వరుసగా  రెండోసారి అధికారాన్ని ఇవ్వరు.  అందువల్ల  కర్నాటకను నిలుపుకోవడం కాంగ్రెస్‌‌‌‌కు చాలా కష్టతరం  అవుతుంది.  బిహార్ ఎన్నికలలో  కాంగ్రెస్  పార్టీ  ఓటమి కర్నాటక  ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బలపరిచింది. ఆయనను  ఇప్పుడు అధిష్టానం పదవి నుంచి తొలగించలేదు. 

మరోవైపు  కర్నాటక  కాంగ్రెస్​ నాయకులు ప్రచారం పొందడానికి చాలా వివాదాస్పద ప్రకటనలు చేస్తుంటారు. ఇది కాంగ్రెస్‌‌‌‌ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేదు.  కానీ వచ్చే  పార్లమెంటు ఎన్నికల్లో అది మంచి ఫలితాలను సాధిస్తే ప్రాంతీయ పార్టీలు దానికి మద్దతు ఇవ్వవచ్చు.

నటుడు విజయ్​ నుంచి కాంగ్రెస్కు ఆహ్వానం

తమిళనాడు: 1967 వరకు తమిళనాడులో కాంగ్రెస్  ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ తర్వాత  డీఎంకే, అన్నాడీఎంకే  తమిళనాడును పాలించాయి. కాంగ్రెస్  ఎంపీ స్థానాలపై మాత్రమే ఆసక్తి చూపించింది.  ఈ  కారణంగా కాంగ్రెస్​ పార్టీకి కూటమిలో భాగస్వామిపక్షం డీఎంకే  అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీకి చెందిన మంత్రులు లేరు.

2024  పార్లమెంటు ఎన్నికల్లో భారీగా ఎంపీ స్థానాలను గెలుచుకున్న డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది.  కాంగ్రెస్‌‌‌‌కు ఉన్న  సమస్య ఏమిటంటే ఇతర పార్టీలతో  జతకట్టడానికి  మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ నాయకుడు, సినీ నటుడు విజయ్ కాంగ్రెస్‌‌‌‌ను  సమావేశానికి ఆహ్వానిస్తున్నాడు. తమిళనాడులో అధికారాన్ని ఇతర పార్టీలతో పంచుకుంటానని చెప్పాడు. ఇది కాంగ్రెస్​కు గొప్ప ఆఫర్.

తెలంగాణ: ఏపీలో కాంగ్రెస్​ తుడుచుపెట్టుకుపోయినా  తెలంగాణలో కాంగ్రెస్  ప్రభుత్వం ఉంది.  అది కాంగ్రెస్‌‌‌‌ మనుగడకు చాలా ముఖ్యమైనది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 17 మంది ఎంపీ స్థానాలలో 8 మందిని మాత్రమే గెలుచుకుంది.  2028లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే  కాంగ్రెస్  ప్రజారంజక పాలనపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే  ప్రజలు నిజంగా కేవలం ఉచితాలకే  ఓటు వేయరు.   ప్రాంతీయ పార్టీ బీఆర్​ఎస్​ ప్రజాబాహుళ్యం నుంచి అదృశ్యం కాలేదు.   బీజేపీ కూడా అధికారంలోకి రావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. కర్నాటక  మాదిరిగా కాకుండా  తెలంగాణలో  కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని ఇరుకునపెట్టేలా పెద్దగా ఇబ్బందికరమైన ప్రకటనలు చేయరు. ఇది కాంగ్రెస్​పార్టీకి పాజిటివ్​అంశం.

వివాదాస్పద ప్రకటనలు తగ్గించుకోవాలి
మతం గురించి,  కులం గురించి తరచుగా మాట్లాడటం సంప్రదాయ కాంగ్రెస్ వ్యాల్యూ  కాదు. ఈ  కుల, మత  విషయాలకు అధిక  ప్రాధాన్యతనివ్వడాన్ని నివారించాలి.  ఎందుకంటే ఇది  ప్రజలను ఒకింత  చికాకు పెడుతుంది. ఇటీవలి  బిహార్ ఎన్నికలు కుల జనాభా గణనను  ప్రధానంగా చూపించాయి.  కానీ,  కుల చర్చ  ప్రతిపక్షాలకు ఏమాత్రం సహాయపడలేదు.  అదేవిధంగా  హాని కలిగించలేదు. 1947 నుండి కాంగ్రెస్ పార్టీ బలం దాని మితవాదం. 

మత రాజకీయాల జోలికిపోకుండా జాగ్రత్తగా పాలన నడుపుతూ,  ఏ మతాన్ని లేదా కులాన్ని బాధపెట్టకుండా కాంగ్రెస్ ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంది. ఎప్పుడూ మతపరంగా పక్షపాతం చూపలేదు. కొన్ని పార్టీలు కులం లేదా మతం గురించి మాత్రమే మాట్లాడుతాయి.  ప్రజలు మెచ్చే పాలన అత్యంత ముఖ్యం.  ప్రతీది ఉచితంగా ఇవ్వడం అనే దానిపై ఆధారపడితే అది ఎల్లకాలం పనిచేయదు. ప్రతీ సూత్రం అన్నివేళలా  పనిచేస్తే డీఎంకే, అన్నాడీఎంకే,  ఇతర రాష్ట్రాలలో  ప్రాంతీయ పార్టీలు శాశ్వతంగా పరిపాలించాలి. కానీ అవి కొన్నిసార్లు ఘోరంగా ఓడిపోయాయి.

కాంగ్రెస్ పునరుజ్జీవనం 
కాంగ్రెస్ పునరుజ్జీవనానికి  దక్షిణాది రాష్ట్రాలు కీలకం. కాంగ్రెస్ అస్సాంలో గెలిచినా,  పంజాబ్‌‌‌‌లో గెలిచినా,  హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లో గెలిచినా పెద్దగా పట్టింపు లేదు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు 130 ఎంపీలలో 74 ఎంపీలను గెలుచుకున్నాయని గుర్తుంచుకోవాలి. 2014లో కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏకే ఆంథోనీ కాంగ్రెస్ ఓటమికి గల కారణాలపై తన నివేదికను ఇచ్చారు.

ఆంథోనీ నివేదిక ‘కాంగ్రెస్ ఒక లౌకిక పార్టీ.  కానీ,  హిందువులు  కాంగ్రెస్​ పార్టీ హిందూ వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నదని భావించినందున, అది ఇప్పుడు లౌకిక పార్టీ కాదని ప్రజలు భావించారు’ అని పేర్కొంది. కాంగ్రెస్ తన పాత విలువలను తిరిగి పాటించాలి.  ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ,  పీవీ నరసింహారావు వంటి నాయకులు ఉన్న  కాంగ్రెస్ లాంటి బలమైన ప్రత్యామ్నాయ పార్టీ  దేశానికి అవసరం.

దక్షిణాది నేతలను ప్రోత్సహించాలి
కాంగ్రెస్  పార్టీ  దక్షిణాదిలో తన ఉనికిని  గౌరవించి కాపాడుకోవాలి. కాంగ్రెస్ అధి నాయకత్వం దక్షిణ భారతదేశం పట్ల సున్నితంగా వ్యవహరించాలి. లేదా  అది ఇతర చోట్ల పొందినట్లుగానే నష్టపోవచ్చు.  కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం స్థానిక నాయకులను ఎదగడానికి, వారు తమ గౌరవాన్ని పొందేందుకు అనుమతించాలి.కర్నాటక  నుండి వెలువడే  వివాదాస్పద ప్రకటనలను,  నాయకుల మధ్య పోటీని ఆపాలని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ధారించుకోవాలి. ఈ  నాయకుల ప్రకటనలు వీరోచితంగా అనిపిస్తాయి. కానీ వాటిని తగ్గించుకుంటేనే మేలు.

దక్షిణాదిలో ప్రజాదరణ పొందిన నాయకులు మరింతగా తమ ప్రాభవాన్ని పెంచుకునేందుకు ప్రోత్సహించాలి.  దక్షిణాదిలో చాలా మంది  ప్రఖ్యాత నాయకులు ఉన్నారని,  వారిని కాంగ్రెస్​ అధిష్టానం గౌరవిస్తున్నదా లేదా అని ప్రజలు గమనిస్తున్నారని  కేంద్ర నాయకత్వం తెలుసుకోవాలి.  క్రియాశీలక రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్న సీనియర్ నాయకులను కాంగ్రెస్‌‌‌‌లో కీలక పాత్ర పోషించడానికి కేంద్ర నాయకత్వం ప్రోత్సహించాలి.  కచ్చితంగా కాంగ్రెస్ సంపద సీనియర్ నాయకులే. 

డా.పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్