ఢిల్లీలో కోర్టులకు బాంబు బెదిరింపులు.. పాటియాలా హౌస్ కోర్టులో నిందితుడి విచారణ

ఢిల్లీలో కోర్టులకు బాంబు బెదిరింపులు.. పాటియాలా హౌస్ కోర్టులో నిందితుడి విచారణ

న్యూఢిల్లీ: ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సహా పలు న్యాయస్థానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎర్రకోట పేలుడు కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న జాసిర్ బిలాల్ వనీ (అలియాస్ దానిష్) పాటియాలా హౌస్​ కోర్టులో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ముందు హాజరైన సమయంలోనే బెదిరింపు ఈ–మెయిల్ రావడం కలకలం సృష్టించింది. దీంతో పాటు సాకేత్, తీస్ హజారీ న్యాయస్థానాలకు కూడా ఇటువంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. 

పాటియాలా హౌస్‌‌‌‌ కోర్టులో జాసిర్ హాజరుకు ముందు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌‌‌‌ఏఎఫ్) మొబైల్ వాచ్ టీమ్‌‌‌‌లతో గట్టి బందోబస్తు పెట్టారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌‌‌‌ కోర్టులో తనిఖీలు చేపట్టాయి. సెక్యూరిటీని మరింత పెంచారు. విచారణ కోర్టు జాసిర్‌‌‌‌ను 10 రోజులు ఎన్‌‌‌‌ఐఏ కస్టడీకి ఇచ్చింది. 

బాంబు బెదిరింపులపై సాకేత్ న్యాయస్థానం బార్ సెక్రటరీ అనిల్ బసోయా మాట్లాడుతూ 2 గంటలు కోర్టు పనులకు అంతరాయం కలిగిందన్నారు. తనిఖీల తర్వాత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయన్నారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్‌‌‌‌లకూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయని ఢిల్లీ బార్ అసోసియేషన్ సెక్రటరీ తరుణ్ రాణా తెలిపారు. అవి బూటకపు బెదిరింపులుగా తేలాయని చెప్పారు.