హైదరాబాద్లో ఆప్ నేతల ఆందోళన

హైదరాబాద్లో ఆప్ నేతల ఆందోళన

ఆప్ నేతలపై కేంద్ర ప్రభుత్వ కక్ష్యపూరిత వైఖరిని నిరసిస్తూ ఆప్ నేతలు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర నేతలపై ఈడీ ఫేక్ కేసులు పెట్టడంపై నిరసనకు దిగారు. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఆప్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఈడీ, సీబీఐ, ఐటీతో ఏర్పాటు చేసిన పోస్టర్లను ఆప్ నాయకులు తగలబెట్టారు. 

ఈడీ, సీబీఐ సంస్థలను పావుగా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులను బనాయిస్తుందని ఆప్ తెలంగాణ శాఖ కొర్ కమిటీ సభ్యుడు డాక్టర్ సుధాకర్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ పై కేసులు పెట్టి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని.. మాట వినని వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర శాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈడీ ఛార్జ్ షీట్ లను తగలబెట్టే కార్యక్రమంలో భాగంగా... రాష్ట్రంలో అన్ని కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సుధాకర్ తెలిపారు.