150 ఓట్లతో మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం

150 ఓట్లతో మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం

సుప్రీంకోర్టులో ఆప్ నిర్ణయాత్మక విజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరోసారి తన సత్తా చాటింది. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో కౌన్సిలర్ షెల్లీ ఒబెరాయ్ 150 ఓట్లతో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు  మూడు సార్లు మేయర్ ఎన్నిక సమావేశం నిర్వహించగా నామినేటెడ్ సభ్యుల ఓటు హక్కు విషయంలో బీజేపీ, ఆప్ ల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో ఆప్ సుప్రీంకోర్డును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తక్షణమే ఎన్నిక జరపాలని ఆదేశాలు జారీ చేసింది.

షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ యూనివర్సిటీ (DU)లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆమె ఇండియన్ కామర్స్ అసోసియేషన్ (ICA) జీవితకాల సభ్యురాలు కూడా.  ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి ఒబెరాయ్ పీహెచ్‌డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్‌ నుంచి గోల్డ్‌ మెడల్‌ను అందుకున్నారు. పలు దేశీయ,అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. 

గతంలో..

గత ఏడాది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక సీట్లతో మెజారిటీ సాధించింది. మొత్తం 250 స్థానాలున్న ఢిల్లీ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ 134 స్థానాలు గెలుచుకుంది. దీంతో 15 ఏళ్లుగా సాగుతున్న బీజేపీ ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది.