క్రికెట్‌కు డివిలియర్స్ గుడ్‌బై.. ఇకపై ఆర్‌సీబీకీ ఆడడు

క్రికెట్‌కు డివిలియర్స్ గుడ్‌బై.. ఇకపై ఆర్‌సీబీకీ ఆడడు

ప్రిటోరియా: సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి సన్యాసం తీసుకుంటున్నట్లు ఏబీడీ ప్రకటించాడు. ఈ నిర్ణయంతో ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న ఏబీ.. ఇకపై ఆ జట్టుకూ ప్రాతినిధ్యం వహించే అవకాశం లేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ట్వి్ట్టర్ వేదికగా ఏబీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘ఇది అద్భుతమైన ప్రయాణం. కానీ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నేను నిర్ణయించుకున్నా’ అని మిస్టర్ 360 డిగ్రీగా అభిమానులు ముద్దుగా పిలుకునే ఏబీ పోస్టు పెట్టాడు. 

ఇన్నేళ్లు క్రికెట్ ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదించానని డివిలియర్స్ పేర్కొన్నాడు. 37 ఏళ్ల వయస్సులో అదే ఉత్సాహంతో ఆటలో కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. సుదీర్ఘ కెరీర్‌లో తనకు సహకరించిన కోచ్‌లు, టీమ్‌మేట్స్, ఫిజియో, స్టాఫ్ మెంబర్లందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. కెరీర్ ఆసాంతం తనను ప్రోత్సహిస్తూ వచ్చిన దక్షిణాఫ్రికా, భారత ప్రజలకు ధన్యవాదాలు చెప్పాడు. కాగా, 2018, ఫిబ్రవరిలో సౌతాఫ్రికా తరఫున చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన ఏబీడీ.. అదే ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ప్రొటీస్‌ జట్టుకు ఆఖరుసారి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో డివిలియర్స్ 5 వేలకు పైగా పరుగులు చేయడం విశేషం. ఇక అంతర్జాతీయ క్రికెట్‌ విషయానికొస్తే.. 114 టెస్టుల్లో 8,765 రన్స్ చేశాడు. వన్డేల్లో 228 మ్యాచ్‌లు ఆడి 9,577 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో 78 మ్యాచుల్లో 1,672 పరుగులు చేశాడు. 

మరిన్ని వార్తల కోసం: 

మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తా

మహిళకు అసభ్య మెసేజ్‌లు.. క్రికెటర్ రాజీనామా

మూడు వ్యవసాయ చట్టాలు రద్దు.. మోడీ క్షమాపణలు