
బ్రిస్బేన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా టెస్ట్ సారథి టిమ్ పైన్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. తోటి మహిళా ఉద్యోగికి పైన్ అసభ్యకరమైన సందేశాలు, ఫొటోలు పంపాడని ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా చేపట్టిన విచారణలో తేలింది. దీంతో తాను ఆసీస్ సారథిగా ఉండేందుకు అనర్హుడినని పేర్కొంటూ పైన్ మీడియా ముందుకు వచ్చాడు. ఇది కష్టమైన నిర్ణయమే అయినా.. తనతోపాటు కుటుంబానికి, కంగారూ క్రికెట్‌కు మంచిదని తెలిపాడు.
‘నాలుగేళ్ల కింద లేడీ కొలీగ్‌తో ప్రైవేట్ టెక్స్ట్ మెసేజ్‌లు చేశాను. అవి అభ్యంతరకరంగా ఉన్నాయ్. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా విచారణ జరిపింది. నేను ఎటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల్ని అతిక్రమించలేదని తెలిపింది. నిర్దోషిగా ప్రకటించబడినప్పటికీ, నేను ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. నేను భార్యతో ఈ విషయమై మట్లాడాను’ అని పైన్ చెప్పాడు. ఇకపోతే, ఇటీవలే టీ20 వరల్డ్ కప్ నెగ్గి జోష్ మీదున్న ఆసీస్ క్రికెట్‌లో టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఒకవిధంగా చిన్నపాటి కుదుపనే చెప్పాలి. ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌కు ముందు ఇది ఆ జట్టుకు మింగుడు పడని విషయమని విశ్లేషకులు అంటున్నారు.