AB de Villiers: కొంచెం ఓపిగ్గా ఉండండి.. బిగ్ ప్లేయర్ అవుతాడు: గిల్‌కు డివిలియర్స్ సపోర్ట్

AB de Villiers: కొంచెం ఓపిగ్గా ఉండండి.. బిగ్ ప్లేయర్ అవుతాడు: గిల్‌కు డివిలియర్స్ సపోర్ట్

టీమిండియా యువ బ్యాటర్ శుభమాన్ గిల్ ప్రస్తుతం భారత జట్టులో మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ ప్లేయర్. గిల్ టెస్ట్, వన్డే ఫార్మాట్ లలో బాగా రాణిస్తున్నపటికీ టీ20ల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఎన్ని ఛాన్స్ లు ఇచ్చినా పదే పదే విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి రెండు టీ20 మ్యాచ్ ల్లో ఘోరంగా విఫలమయ్యాడు . తొలి మ్యాచ్ లో నాలుగు పరుగులే చేసిన గిల్.. రెండో మ్యాచ్ లో డకౌటయ్యాడు. దీంతో గిల్ ను జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ డివిలియర్స్ మాత్రం గిల్ కు సపోర్ట్ గా నిలిచాడు.            

డివిలియర్స్ మాట్లాడుతూ.. " శుభమాన్ గిల్ ఒకటి రెండు మ్యాచ్ ల్లో విఫమయ్యాడు. దీంతో వెంటనే అతనికి రీప్లేస్ గురించి ఆలోచిస్తున్నారు. గిల్ విషయంలో కొంచెం ఓపికగా ఉండండి. లైనప్‌లో చాలా మంది దూకుడు బ్యాటర్లు ఉన్నారు కాబట్టి జట్టుకు గిల్ లాంటి వ్యక్తి అవసరం. నాకు శుభ్‌మాన్‌ ఫామ్ పై ఆందోళన లేదు. అతనికి వ్యక్తిత్వం ఉంది. నా మాటలను గుర్తుంచుకోండి. అతను పెద్ద మ్యాచ్‌లలో పరుగులు సాధిస్తాడు. మీరు కోరుకునే ఆటను ఆడతాడు". అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. 

టీ20 వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ ఫామ్ ఇండియాను కలవరపెడుతోంది. ఆసియా కప్ నుంచి గమనిస్తే గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. కాన్‌‌‌‌‌‌‌‌బెరాలో తొలి టీ20లో మాత్రమే కెప్టెన్ సూర్యతో కలిసి కాస్త మెప్పించాడు. ఆ తర్వాత నాలుగో వన్డేలో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 4 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. అడపాదడపా ఇన్నింగ్స్ లు తప్పితే గిల్ పెద్దగా రాణించడం లేదు. 

గిల్ చివరి 13 ఇన్నింగ్స్ లు చూసుకుంటే 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2) ఇలా ఉన్నాయి. కేవలం 3 సార్లు మాత్రమే 30 పరుగుల మార్క్ అందుకున్నాడు. సౌతాఫ్రికాపై జరిగిన రెండో టీ20లో తొలి బంతికే డకౌటయ్యాడు. దీంతో గిల్ స్థానంలో శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. మరి డివిలియర్స్ చెప్పినట్టు గిల్ ఫామ్ లోకి వస్తాడా లేకపోతే పేలవ ఫామ్ తో జట్టులో స్థానం కోల్పోతాడో తెలియాల్సి ఉంది.