AB de Villiers: సచిన్, కోహ్లిలలో ఎవరు బెస్ట్.. డివిలియర్స్ సమాధానమిదే!

AB de Villiers: సచిన్, కోహ్లిలలో ఎవరు బెస్ట్.. డివిలియర్స్ సమాధానమిదే!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టీమిండియా తరపున బ్యాటింగ్ రికార్డులన్నీ తమ పేరిట లిఖించుకున్నారు. అప్పటి తరంలో సచిన్  ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ క్రీజ్ లో ఉంటే ఎదురుగా ఎలాంటి జట్టు ఉన్నా బెంబేలిత్తిస్తాడు. రెండు దశాబ్దాలుగా సచిన్ బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తే.. మోడ్రన్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు ఐకాన్ గా మారాడు. ఈ ఇద్దరిలో ఎవరు గ్రేట్ అనే విషయం చెప్పడం కష్టం. అయితే ఇదే ప్రశ్న సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కు ఎదురైంది.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్ తర్వాత శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌ లో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని చెప్పాడు. డివిలియర్స్ మాట్లాడుతూ.. "నాకు సచిన్ అంటే చాలా గౌరవం ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు. విరాట్ నాకు ఫ్రెండ్. ఇద్దరు రెండు జెనరేషన్స్ కు చెందినవారు. వారిద్దరిని పోల్చడం సరికాదు. కాబట్టి చెప్పడం చాలా కష్టం. విరాట్ అన్ని ఫార్మాట్లలో గొప్ప ఆటగాడని నేను అనుకుంటున్నాను. సచిన్ లాంగ్ ఫార్మాట్‌లో గ్రేట్". అని డివిలియర్స్ అన్నాడు. 

తాజాగా ముగిసిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ లో డివిలియర్స్ తన విశ్వ రూపాన్ని చూపించాడు. పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్లో 60 బంతుల్లోనే 7 సిక్సర్లు, 12 ఫోర్లతో 120 పరుగులు చేసి పాకిస్థాన్ కు చుక్కలు చూపించాడు. కేవలం ఆరు ఇన్నింగ్స్‌లలో 431 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. డివిలియర్స్ యావరేజ్ 143.67 కాగా.. స్ట్రైక్ రేట్ 221.03 ఉండడం విశేషం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు డివిలియర్స్ కే లభించాయి.

Also Read :  ఆసియా కప్ వేదికలు ఖరారు.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎక్కడంటే..?

2018, ఫిబ్రవరిలో సౌతాఫ్రికా తరఫున చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన ఏబీడీ.. అదే ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ప్రొటీస్‌ జట్టుకు ఆఖరుసారి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో డివిలియర్స్ 5 వేలకు పైగా పరుగులు చేయడం విశేషం. ఇక అంతర్జాతీయ క్రికెట్‌ విషయానికొస్తే.. 114 టెస్టుల్లో 8,765 రన్స్, వన్డేల్లో 228 మ్యాచ్‌లు ఆడి 9,577 పరుగులు చేశాడు. ఇక టీ20 ల్లో 78 మ్యాచుల్లో 1,672 పరుగులు చేశాడు.