భారత్ భారీ విజయం.. ఆపరేషన్ సిందూర్‎లో జేఎం మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజార్ హతం

భారత్ భారీ విజయం.. ఆపరేషన్ సిందూర్‎లో జేఎం మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజార్ హతం

ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దేశంలో దాడులకు పాల్పడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తోన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన మెరుపు దాడుల్లో దాదాపు 100 మంది టెర్రరిస్టులు కుక్క చావు చచ్చారు. మృతుల్లో పలువురు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఉన్నారు. జైష్-ఎ-మొహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరుడు, IC-814 ఎయిర్ ఇండియా విమాన హైజాక్‌కు ప్రధాన సూత్రధారి అయిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబ్దుల్ రవూఫ్ అజార్ ఆపరేషన్  సిందూర్‎లో హతమయ్యాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్థాన్‎తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‎లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్‌ బహవల్‌పూర్‌లోని జైషీ మహ్మద్ ప్రధాన కార్యాలయంపై కూడా భారత్ ఎటాక్ చేసింది. భారత మిసైల్ దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్‌ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది మరణించారు. మృతుల్లో జైష్-ఎ-మొహమ్మద్‌ సుప్రీం కమాండర్ అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఉన్నట్లు తెలిసింది. 

అబ్దుల్ రవూఫ్ అజార్ బ్యాక్ గ్రౌండ్

అబ్దుల్ రవూఫ్ అజార్ పాకిస్తానీ దేవబంది జిహాదిస్ట్ మతాధికారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఇతడు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) సుప్రీం కమాండర్‌గా పనిచేశాడు. భారత్‎పై దాడులను ప్లాన్ చేయడంలో అబ్దుల్ రవూఫ్ ఎక్స్‎పర్ట్. రవూఫ్ తన 24 ఏళ్ల వయసులోనే 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC-814 హైజాక్‌ చేయడంలో కీలక సూత్రధారి.  IC-814 విమానం హైజాక్ చేసి.. జైల్లో ఉన్న తన సోదరుడు, జైషీ మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‎ను జైలు నుంచి విడిపించాడు. ఇదే కాకుండా జైష్-ఎ-మొహమ్మద్‌ ఉగ్రసంస్థ భారత్‎లో చేసిన దాడుల్లో అబ్దుల్ రవూఫ్‎ది మాస్టర్ మైండ్. 

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ, భారత పార్లమెంటుపై 2001 ఫిదాయీన్ దాడులు, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, నగ్రోటా, కథువాలో సైనిక శిబిరాలపై దాడులు వెనక కూడా ఇతడి హస్తం ఉంది. 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని బలిగొన్న 2019 పుల్వామా ఎటాక్‎తో  కూడా రవూఫ్‎కు  సంబంధం ఉంది. తన సోదరుడు మసూద్ జైల్లో ఉన్నప్పుడు కానీ, అనారోగ్యంతో ఉన్నప్పుడు జేఎం కార్యాచరణ నిర్ణయాలు అన్ని ఇతడే తీసుకునేవాడు. 

అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ హత్య ప్రయత్నాల తర్వాత జేఎం అజ్ఞాతంలోకి వెళ్లినప్పుడు రవూఫ్ అజార్ ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లి తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగించి.. జేఎం గ్రూపు నిర్వీర్యం కాకుండా పునర్నిర్మించడంలో కీ రోల్ ప్లే చేశాడు. భారత్ లో ఎన్నో దాడులు చేసి రక్తపాతం పారించిన అబ్దుల్ రవూఫ్ అజార్ ను ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో చేర్చింది. ఇతడిని పట్టుకోవడం కోసం నిఘా సంస్థలు పని చేస్తున్నాయి. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‎గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎లో ఈ జేఎం మాస్టర్ మైండ్ హతమయ్యాడు.