అమ్మాయితో చాటింగ్ అనగానే ముందువెనుక చూసుకోకుండా చాట్ చేస్తున్నారా! అయితే ఇక మీదట జాగ్రత్త. చాలావరకు అందరూ వాట్సాప్ కానివ్వండి.. మరే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కానివ్వండి.. ఛాటింగ్ చేసే సమయంలో ఫీలింగ్ ఎక్స్‌ప్రెస్ చేసేందుకు రకరకాల ఎమోజీలు పంపేస్తుంటారు. ఇకపై ముందువెనుక చూసుకోకుండా అలా పంపితే చిక్కులు తప్పవు.
ఎప్పుడూ కఠిన చట్టాలు తీసుకొస్తూ వార్తల్లో నిలుస్తున్న కువైట్ ప్రభుత్వం మరో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. వాట్సాప్ లేదా మరేదైనా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా అమ్మాయికి హార్ట్ ఎమోజీ పంపితే వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ నేరానికి పాల్పడిన వారికి 2,000 కువైట్ దినార్ల(భారత కరెన్సీలో దాదాపు రూ.5 లక్షలు) జరిమానాతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని తెలిపింది.
సౌదీలో రూ.20 లక్షల జరిమానా
ఇప్పటికే సౌదీ ప్రభుత్వం ఈ తరహా నిబంధనలు అమలులోకి తెచ్చింది. సోషల్ ప్లాట్‌ఫామ్ లలో రెడ్ హార్ట్ సింబల్ పంపినవారికి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు.. రూ.20 లక్షల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా.. వారి వాట్సాప్‌కి రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి కేసుల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు దోషిగా తేలితే 60 లక్షల జరిమానాతో పాటు ఐదేండ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.