మహిళలకు బ్యాడ్‌న్యూస్.. అభయ హస్తం రద్దు

మహిళలకు బ్యాడ్‌న్యూస్.. అభయ హస్తం రద్దు

2009 నాటి చట్టాన్ని ఎత్తేస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్

వైఎస్​ హయాంలో అమల్లోకి వచ్చిన పెన్షన్​ చట్టం

భర్తకు పెన్షన్​ వచ్చినా.. భార్యకూ ఇచ్చేలా వెసులుబాటు

ఆసరా స్కీంతో ప్రయోజనం ఎక్కువంటూ అభయ హస్తాన్ని పక్కన పెట్టిన సర్కారు

కొత్త రూల్స్​ మేరకు అభయ హస్తం సభ్యులకు పెన్షన్​

ఆసరా పరిధిలోకి రాని వారికి డబ్బు వాపస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం పథకాన్ని రద్దు చేసింది. మహిళల నుంచి ఏటా కొంత సొమ్ము వాటాగా తీసుకుని పెన్షన్  ఇచ్చే ‘ది తెలంగాణ​ సెల్ఫ్​హెల్ప్​ గ్రూప్స్  విమెన్​ కోకాంట్రిబ్యూటరీ పెన్షన్​ చట్టం (అభయ హస్తం చట్టం)’ను ఎత్తివేసింది. ఈ మేరకు ఆదివారం అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. అభయ హస్తం పథకం కంటే ఆసరా పెన్షన్​ స్కీం ప్రయోజనం ఎక్కువగా ఉన్నందున అభయ హస్తం పథకాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చెప్పారు.

2016లోనే నిలిచిపోయిన స్కీం

2009లో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి అభయ హస్తం పెన్షన్ పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో వృద్ధాప్య పెన్షన్​ రూ.200 ఉండగా.. అభయ హస్తం పెన్షన్​ను రూ.500గా ప్రకటించారు. అంతేగాక భర్తకు వచ్చే వృద్ధాప్య పెన్షన్​తో సంబంధం లేకుండా అభయ హస్తం మహిళలకు పెన్షన్ వచ్చే అవకాశం కల్పించారు. దాంతో 23 లక్షల 28 వేల 14 మంది పథకంలో సభ్యులుగా చేరారు. వారు రోజుకు రూపాయి చొప్పున ఏటా రూ.365 వాటాగా చెల్లిస్తే.. ప్రభుత్వం అంతే మొత్తంలో జమ చేసేది. ఇలా జమ అయిన మొత్తం రూ.1,500 కోట్లకుపైగా ఉన్నట్టు అంచనా. రాష్ట్ర ఏర్పాటు నాటికి అభయ హస్తం నుంచి 2 లక్షల 20 వేల 12 మంది పెన్షన్​ తీసుకుంటున్నారు. అయితే 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా కింద పెన్షన్  వెయ్యికి పెంచడంతో.. దానికి అర్హులైన లక్షా 33 వేల 415 మంది అభయ హస్తం సభ్యులు ఆసరా పరిధిలోకి మారారు. మిగతా 86 వేల 597 మందికి 2016 అక్టోబర్​​నుంచి అభయ హస్తం పెన్షన్​ నిలిచిపోయింది. ఆసరా నిబంధనల మేరకు పెన్షన్​ కు అర్హులు కాని అభయహస్తం లబ్ధిదారులకు డబ్బు వాపస్ చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే గ్రామాల్లో అభయహస్తం సభ్యుల పేర్లు, వారు చెల్లించిన మొత్తం, బ్యాంక్​ ఖాతా నంబర్లను సెర్ప్​ అధికారులు సేకరిస్తున్నారు. ఆ డేటా అందగానే డబ్బును నేరుగా వారి ఖాతాల్లో వేయనున్నారు.

వారికి పెన్షన్​ రానట్టే!

భర్తకు వచ్చే పెన్షన్​తో సంబంధం లేకుండా మహిళలకు పెన్షన్​ ఇచ్చేందుకు అభయ హస్తం చట్టం తెచ్చారని, ఇప్పుడు దానిని రద్దు చేయడంతో వేల మందికి పెన్షన్​ అవకాశం లేకుండా పోతోందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక ఆసరా నిబంధనలకు అనుగుణంగా ఉన్న అభయ హస్తం వాటాదారులను గుర్తించాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. భర్తకు వృద్ధాప్య పెన్షన్ రాకుండా ఉండి, 57 ఏళ్లు నిండిన అభయ హస్తం మహిళలు 1.90 లక్షల మంది వరకు ఉన్నారని అధికారులు గుర్తించారు. వారికి ఆసరా పెన్షన్​ మంజూరు చేసే అవకాశం ఉంది.

రద్దు… తుగ్లక్ చర్యే

మహిళలకు అండగా నిలిచిన అభయ హస్తం పథకాన్ని రద్దు చేయడం తుగ్లక్ చర్యేనని  కాంగ్రెస్  అధికార  ప్రతినిధి ఇందిరాశోభన్ అన్నారు. పథకం పేరులో  హస్తం అని ఉందని, ఇది కాంగ్రెస్​కు పేరు తెస్తుందనే ఉద్దేశంతోనే  రద్దు చేయాలని నిర్ణయించారని ఆమె విమర్శించారు. అభయ హస్తం ఎంతో మంది మహిళల గౌరవాన్ని పెంచిందని చెప్పారు. స్కీంలో ఉన్న సభ్యురాలు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.75 వేల పరిహారం, సహజ మరణమైతే రూ.30 వేలు, అంత్యక్రియలకు రూ.5 వేలు ఇచ్చేవారని గుర్తు చేశారు. సభ్యుల పిల్లలకు 9 వ తరగతి నుంచి ఇంటర్​వరకు రూ.1200  స్కాలర్​షిప్​ వచ్చేదన్నారు. ఇలాంటి మంచి పథకాన్ని దురుద్దేశంతో ప్రజలకు దూరం చేయటం సరికాదని ఇందిరా శోభన్ అన్నారు.

For More News..

త్వరలో మిషన్ హైదరాబాద్

మే నుంచి కరెంట్ బిల్లుల పెంపు.. మధ్య తరగతిపై భారం

గుడ్‌న్యూస్.. కరోనా టెస్టులు ఫ్రీ

కట్నం కోసం కరోనా వేధింపులు