పాఠ్యాంశంగా అభినందన్ జీవితం

పాఠ్యాంశంగా అభినందన్ జీవితం

రాజస్థాన్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. అరుదైన అవార్డులు వరించాయి. ఇప్పుడు అభినందన్ కు మరో గుర్తింపు దక్కనుంది. ఆయన లైఫ్ స్టోరీని పాఠ్యాంశంగా మలచనున్నారు. వింగ్ కమాండర్‌ అభినందన్‌ వీరోచిత పోరాటం రాజస్థాన్‌ విద్యార్ధులకు పాఠంగా మారనుంది. ఈ విషయాన్ని రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి గోవింద్‌ సింగ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ప్రాథమిక పాఠశాల విద్యలో ఈ అంశాన్ని చేర్చేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. అతని పోరాటానికి ఇదే నిజమైన గుర్తింపు అని ఆయన తెలిపారు. అయితే ఏయే తరగతుల్లో ఈ అంశాన్ని చేర్చనున్నారో తెలియాల్సి ఉంది.

ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌ పై భారత్‌ ఎయిర్‌స్ట్రైక్‌ చేయగా.. పాక్‌ కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చే క్రమంలో కూలిపోయిన భారత యుద్ధ విమానం మిగ్‌-21 నుంచి వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ బయటపడి, పాకిస్థాన్‌ భూభాగంలో దిగారు. శత్రు దేశానికి చిక్కినా పట్టు వదలకుండా, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, దేశ రక్షణ రహస్యాలను ఏమాత్రం బయటపెట్టలేదు. రెండు రోజుల తర్వాత స్వదేశానికి క్షేమంగా చేరుకున్నారు. దేశ ప్రజలు అతడి ధైర్యానికి నీరాజనాలు పలికారు. క్షేమంగా తిరిగి రావాలని పూజలు చేశారు. జాతీయ జెండాలతో ర్యాలీ చేసి దేశ భక్తిని చాటుకున్నారు.