
బాబ్ విశ్వాస్.. ఈ పేరు వినగానే విద్యాబాలన్ ‘కహానీ’ సినిమా గుర్తొస్తుంది. అందులోని ఓ పాత్ర పేరే ఇది. ఆజానుబాహుడు కాడు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ కాదు. ఓసారి చూస్తే గుర్తుండిపోయే ఫేసూ కాదు. నున్నగా దువ్విన జుట్టు, కళ్లజోడు, భుజానికి బ్యాగ్‌తో సింపుల్‌గా కనిపిస్తాడు బాబ్ విశ్వాస్. కానీ కనిపించినంత అమాయకుడు కాదు. క్రూరమైన హంతకుడు. చంపాల్సినవాళ్ల దగ్గరికి పోయి ‘నమస్కారం.. ఒక్క నిమిషం’ అంటాడు. వాళ్లు తనవైపు తిరగ్గానే దారుణంగా చంపేస్తాడు. చిన్న క్లూ కూడా వదలని పర్‌ఫెక్ట్ సుపారీ కిల్లర్. అందుకే ఆ పాత్రనే లీడ్ రోల్ చేసి, అదే పేరుతో సినిమా నిర్మించాడు షారుఖ్ ఖాన్. దియా అన్నపూర్ణ ఘోష్ డైరెక్ట్ చేశారు. లీడ్ రోల్‌లో అభిషేక్ బచ్చన్ నటించాడు. ఈ మూవీని డిసెంబర్ 3న జీ5లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ నిన్న ట్రైలర్‌ను విడుదల చేశారు. నరరూప రాక్షసుడైన బాబ్ గతాన్ని మర్చిపోతాడు. అతనికి తన పాస్ట్‌ని గుర్తు చేసి నిజాలు రాబట్టాలని పోలీసులు ఓవైపు, మళ్లీ హత్యలు చేయడానికి ఉపయోగించుకోవాలని బడా బాబులు ఒకవైపు ప్రయత్నిస్తుంటారు. వారి ప్రయత్నం ఫలించిందా? అసలు బాబ్ గతమెలా మర్చిపోయాడు? నిజంగా మర్చిపోయాడా నటిస్తున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం సినిమా చూసి తెలుసుకోమంటోంది టీమ్. బాబ్ క్యారెక్టర్‌లో అభి పర్‌ఫెక్ట్‌గా ఉన్నాడు. ఈ పాత్రతోనైనా తన ఖాతాలో హిట్ పడుతుందేమో చూడాలి.