రాహుల్‌‌ చాలా శ్రమించాడు: ఇంగ్లండ్ టూర్‌‌లో సక్సెస్‌‌కు కారణమదే: నాయర్

రాహుల్‌‌ చాలా శ్రమించాడు: ఇంగ్లండ్ టూర్‌‌లో సక్సెస్‌‌కు కారణమదే: నాయర్

ముంబై: ఐపీఎల్‌‌ చివరి మ్యాచ్‌‌ తర్వాత కేఎల్‌‌ రాహుల్‌‌ ఇంగ్లండ్‌‌ టూర్‌‌ గురించే ఎక్కువ ఆలోచించాడని టీమిండియా మాజీ అసిస్టెంట్‌‌ కోచ్‌‌ అభిషేక్‌‌ నాయర్‌‌ అన్నాడు. ప్రతి నిమిషం ఈ టూర్‌‌కు ప్రిపేర్‌‌ కావడానికే గడిపాడన్నాడు. దాని ఫలితమే ఇప్పుడు వస్తున్న గుర్తింపు అని చెప్పాడు. అయితే రాహుల్‌‌ టెక్నికల్‌‌గా చేసిన మార్పులను తాను వెల్లడించలేనప్పటికీ ఆశించిన ఫలితాలను చూడటం తనకు సంతోషంగా ఉందన్నాడు. ‘రాహుల్‌‌లో నేను చూసిన మార్పుల గురించి మాట్లాడలేను. ఎందుకంటే అది ఇప్పుడు గొప్పగా ఉంటుంది. తర్వాత ప్రభావం తగ్గుతుంది. కానీ చేసిన మార్పులు నిజంగా పని చేశాయి. నేనెప్పుడూ ఒకటే చెబుతుంటా. క్రికెటర్‌‌ లేదా జట్టు సక్సెస్‌‌ కావాలంటే కొన్ని అంశాలు విజయవంతం కావాలి’ అని నాయర్‌‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌‌ తర్వాత రాహుల్‌‌ ఒక్క నిమిషం కూడా వృథా చేయలేదన్న నాయర్‌‌ ఇంగ్లండ్‌‌ టూర్‌‌కు ప్రిపేర్‌‌ కావడానికే ఎక్కువ సమయం వెచ్చించాడని చెప్పాడు. ‘ఐపీఎల్‌‌ ఆడుతున్నప్పుడు రాహుల్‌‌కు బిడ్డ పుట్టాడు. అతను వెళ్లి చూసి వెంటనే వచ్చేశాడు. 

ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అప్పటికే అతను ఇంగ్లండ్‌‌తో టెస్ట్‌‌ సిరీస్‌‌కు రెడీ కావడం ప్రారంభించాడు. చాలా మంది అలా చేయరు. ఈ సిరీస్‌‌ ప్రాముఖ్యత అతనికి తెలుసు కాబట్టి దాన్ని అర్థం చేసుకుని వెంటనే తిరిగొచ్చాడు. అలా కష్టపడ్డాడు కాబట్టే ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి రాహుల్‌‌కు పూర్తి అర్హత ఉంది’ అని అభిషేక్‌‌ వెల్లడించాడు. ఇంగ్లండ్‌‌ టూర్‌‌లో ప్లేయర్లు చూపించిన తెగువను నాయర్‌‌ ప్రశంసించాడు. పరుగులు చేయడంలో, పరిస్థితులతో పోరాడటంలో కీలక పాత్ర పోషించారన్నాడు. ఆ గడ్డపై తమను తాము నిరూపించుకోవాలనే తపన వారిలో ఎక్కువగా కనబడిందన్నాడు. మాంచెస్టర్‌‌లో ప్లేయర్ల ధృడ సంకల్పం, చూపించిన పోరాటం... టెస్ట్‌‌ క్రికెట్‌‌ పట్ల వారికి ఉన్న భావనను తెలియజేస్తోందని కొనియాడాడు. ఐదు టెస్ట్‌‌ల సిరీస్‌‌లో రాహుల్‌‌ ఇండియా తరఫున అత్యధిక రన్స్‌‌ చేసిన రెండో ప్లేయర్‌‌గా నిలిచాడు. రెండు సెంచరీలు, రెండు హాఫ్‌‌ సెంచరీలతో 53.20 సగటుతో 532 రన్స్‌‌ సాధించాడు. ఇక యశస్వి జైస్వాల్‌‌తో కలిసి బలమైన ఓపెనింగ్‌‌ భాగస్వామ్యాలను నెలకొల్పాడు.