
ఆదివారం (సెప్టెంబర్ 21) ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్ లో హై డ్రామా నడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 172 పరుగులను ఛేజింగ్ చేసే క్రమంలో టీమిండియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అభిషేక్ శర్మ తొలి ఓవర్ తొలి బంతికే అఫ్రిది బౌలింగ్ లో సిక్సర్ కొట్టి తనదైన స్టయిల్లో ఇన్నింగ్స్ ఆరంభించాడు. మరోవైపు గిల్ కూడా వరుస బౌండరీలతో హోరెత్తించడంతో ఇండియా స్కోర్ పరుగులు పెట్టింది. ఈ దశలో పాక్ ఫాస్ట్ బౌలర్లు అఫ్రిది, హారిస్ రౌఫ్ టీమిండియా ఓపెనర్లు అభిషేక్, గిల్ లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
ఎలాంటి కారణం లేకుండా పాక్ బౌలర్లు మీదకి రావడంతో అభిషేక్ మరింత చెలరేగిపోయాడు. పాకిస్థాన్ కు బ్యాట్ తో సమాధామనమిచ్చాడు. 39 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ తర్వాత అసలు గొడవ ఏంటో అభిషేక్ వివరించాడు.. " పాకిస్తాన్ ఆటగాళ్లు ఎటువంటి కారణం లేకుండా మాపైకి దూసుకొస్తున్నారు. వారి విధానం నాకు అసలు నచ్చలేదు. నేను వారికి నా బ్యాటింగ్ తోనే బుద్ధి చెప్పాలనుకున్నా. దూకుడుగా ఆడి పాక్ పై ఆధిపత్యం చెలాయించడం సంతోషంగా ఉంది". అని మ్యాచ్ తర్వాత అభిషేక్ ప్రెజెంటేషన్‌లో అన్నాడు.
శుభమాన్ గిల్ పై తన అనుభవాన్ని పంచుకుంటూ.. ఈ విధంగా అన్నాడు. "గిల్ తో నా అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. మేము స్కూల్ రోజుల నుండి కలిసి ఆడుతున్నాం. ఫ్రెండ్ షిప్ ను ఆస్వాదిస్తాం. మేమిద్దరం దూకుడుగా బ్యాటింగ్ చేయడం సంతోషాన్ని ఇచ్చింది". అని అభిషేక్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం (సెప్టెంబర్ 21) దుబాయ్ ఇంటర్ నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ పై 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి దాయాధి జట్టుకు మరోసారి ఘోర పరాభవాన్ని మిగిల్చింది.
టాస్ ఓడిన పాక్ తొలుత 20 ఓవర్లలో 171/5 స్కోరు చేసింది. ఓపెనర్ సాహిబ్జదా ఫర్హాన్ (45 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 58) ఫిఫ్టీతో సత్తా చాటగా.. సైమ్ ఆయుబ్ (21), మహ్మద్ నవాజ్ (21), ఫహీమ్ అష్రఫ్ (20 నాటౌట్) రాణించారు. అనంతరం ఇండియా 18.5 ఓవర్లలో 174/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.అభిషేక్ శర్మ (39 బాల్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74) విధ్వంసకర బ్యాటింగ్‌తో షేక్ చేసేశాడు. అతనికి తోడు శుభ్‌మన్ గిల్ (28 బాల్స్‌లో 8 ఫోర్లతో 47) కూడా తిలక్ వర్మ (19 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 నాటౌట్) కూడా రాణించాడు.