భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం, బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. ముందుగా సుప్రభాత సేవ చేసి మూలవరులకు ఆవు పాలు, నెయ్యి, పెరుగు, పంచదార, తేనెలతో అభిషేకం చేశారు. మంజీరాలను అద్ది, అనంతరం స్నపన తిరుమంజనం జరిపించారు.
ఈ సందర్భంగా భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. తర్వాత మూలవరులను అందంగా అలంకరించి విశేష హారతులు ఇచ్చారు. భక్తులకు దర్శనం కల్పించారు. ఇదే సమయంలో బంగారు పుష్పాలతో అర్చన చేయడంతో ఆర్జిత సేవగా భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం చేయగా, 46 జంటలు కంకణాలు ధరించి క్రతువు నిర్వహించారు.
విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక మంత్రపుష్పంతో క్రతువు ముగిసింది. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. తన తల్లి కనకదుర్గ జన్మదినం సందర్భంగా ఏఈవో భవానీ రామకృష్ణ గోశాలకు రూ.51,116లను విరాళంగా అందజేశారు.
హైదరాబాద్ లోని ఈస్ట్ మారేడుపల్లిలో సీతారాముల కల్యాణం
హైదరాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలో ఆదివారం భద్రాచలం సీతారాముల కల్యాణం జరిగింది. రామరథంలో భద్రాచలం నుంచి సీతారామచంద్రస్వామి మూర్తులను తీసుకెళ్లగా అక్కడ శోభాయాత్ర నిర్వహించారు.
భక్తులు రామనామస్మరణలతో యాత్రలో పాల్గొని కల్యాణ వేదిక వద్దకు తీసుకెళ్లారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. స్థానిక భక్తులు కంకణాలు ధరించి క్రతువును నిర్వహించారు.
