- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ సమ్మేళనంలో నేతల డిమాండ్
- వీఆర్ఏల కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించొద్దు
- ఏజెన్సీల ఆగడాలతో ఉద్యోగులు ఆత్మహత్యలు చేస్కుంటున్రు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంతో మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. తక్షణమే తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అరకొర జీతాలను సైతం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు మూడు నాలుగు నెలలకోసారి ఇస్తున్నారని, దీంతో రెండున్నర లక్షలకుపైగా ఉద్యోగులు గోస పడుతున్నారని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్ లో ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో జిల్లాల నుంచి వేలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు. సమావేశంలో జేఏసీ నేతలు పులి లక్ష్మయ్య, కె.సంతోష్, వినోద్, అరుణ్‌కుమార్, నారాయణ, బిందు తదితరులు మాట్లాడారు. ఏజెన్సీల ఆగడాలతో ఎంతో మంది ఉద్యోగులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారని మండిపడ్డారు. మూడేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు.
మిగతా వారికి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కొత్త ఏజెన్సీలు వచ్చినప్పుడు పాత ఉద్యోగులను తొలగిస్తున్నారని, రూ. లక్షలు వసూలు చేసి కొత్త వారిని నియమించుకుంటున్నారని నేతలు చెప్పారు. భారీగా లంచాలు ఇస్తే తప్ప పాత వారిని కొనసాగించడం లేదని, అధికారులూ ఏజెన్సీలకే సహకరిస్తున్నారని ఆరోపించారు. కొన్ని చోట్ల లీడర్లే ఏజెన్సీలను నడుపుతుండటంతో వారి ఆగడాలకు అడ్డూఆపూ లేకుండాపోయిందన్నారు.
వీఆర్ఏల కోసం మమ్మల్ని తీసెయ్యొద్దు..
పశు సంవర్ధకశాఖలో వీఆర్ఏల సర్దుబాటును కారణంగా చూపుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించవద్దని జేఏసీ నేతలు కోరారు. వీఆర్ఏల సర్దుబాటు కోసం పశు సంవర్ధక శాఖ స్టేట్ ఆఫీస్ అధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పోస్టులను సైతం ఖాళీగా చూపించడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. ఈ శాఖలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 520 మంది ఆఫీస్ సబార్డినేట్లతో పాటు మరికొందరు జూనియర్ అసిస్టెంట్ల నెత్తిపై కత్తి వేలాడుతోందన్నారు. ఇప్పటికే నాలుగైదు జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులకు రావద్దని అధికారులు తేల్చిచెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వీరి సేవలను కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు ప్రసాద్, కృష్ణ, గోవర్ధన్, జహీరుద్దీన్, శ్రీధర్, జగదీశ్, శ్రీనాథ్‌గౌడ్, విజయలక్ష్మి, సునీత, రాజిరెడ్డి, సురేందర్, సంధ్య, యాదయ్య, నాజర్, తదితరులు పాల్గొన్నారు.
