వ్యవసాయ చట్టాల రద్దు.. దేశ రైతాంగ విజయం

వ్యవసాయ చట్టాల రద్దు.. దేశ రైతాంగ విజయం

ఇందిరా గాంధీ పుట్టిన రోజున నల్ల చట్టాల రద్దుతో రైతులు విజయం సాధించారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయ సంక్షోభానికి కారణం మోడీ, కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. ముందే ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటే వందలమంది రైతుల ప్రాణాలు పోయేవి కాదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 13 నెలలుగా అకుంఠిత దీక్షతో పోరాటం చేశారు. ప్రభుత్వం మెడలు వంచి.. నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా పోరాటం చేశారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా పోరాటం చేస్తుందో... రైతులు కూడా అదే స్ఫూర్తితో ఉద్యమం చేశారు. గుజరాత్ నుంచి వచ్చిన నలుగురు దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. వ్యవసాయాన్ని అదానీ, అంబానీకి అమ్మకానికి పెట్టాలని చూశారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజున నల్ల చట్టాల రద్దుతో రైతులు విజయం సాధించారు. రైతు ఉద్యమాలకు కాంగ్రెస్ అండగా నిలబడింది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పక్షాన పాదయాత్ర చేశా. మొదటి రోజే చట్టలు వెనక్కి తీసుకుంటే రైతుల ప్రాణాలు మిగిలేవి. వందల మంది రైతుల ప్రాణాలు పోవడానికి మోడీనే కారణం. రైతులు మోడీని క్షమించరు.  తెలంగాణ అసెంబ్లీలో కూడా రైతు చట్టాలకు వ్యతిరేక తీర్మానం చేయాలని డిమాండ్ చేశాం. కానీ, మా ఎమ్మెల్యేలను బయటకు పంపారు. రైతులకు శుభాకాంక్షలు. వ్యవసాయ సంక్షోభానికి కారణం మోడీ, కేసీఆర్. పార్లమెంట్‎లో రైతు చట్టాలకు అనుకూలంగా కేసీఆర్ ఓటేశారు. సభలో చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసే ధైర్యం లేదు కానీ, క్రెడిట్ అంతా నాది అంటున్నారు. ఇది ముమ్మాటికీ రైతులను అవమానించడమే. ఎవడికో పుట్టిన పిల్లలకు.. మరెవడో కుల్ల కుట్టించినట్లుంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

వ్యవసాయ చట్టాల రద్దు.. దేశ రైతాంగ విజయం
వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవడంపై దేశ రైతాంగానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గడం.. ముమ్మాటికి దేశ రైతాంగ విజయమని ఆయన అన్నారు. దేశానికి వెన్నెముకైన రైతు కన్నెర్ర చేస్తే.. ఎంతటి నియంతైనా దిగిరాక తప్పదు అనడానికి ఇది నిదర్శనమని రేవంత్ అన్నారు. రైతాంగ పోరాట చరిత్రలో ఇదొక చారిత్రక విజయమని ఆయన చెప్పారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. రైతుల సంకల్పం ముందు అవి తునాతునకలయ్యాయని పీసీసీ చీఫ్ అన్నారు. కేంద్రం ముందే కళ్లు తెరిచి ఉంటే ఉద్యమంలో వందల మంది రైతుల ప్రాణాలు పోయేవి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇతర ప్రజా సమస్యలపై పోరాటానికి రైతు ఉద్యమం స్ఫూర్తినిచ్చిందని ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ కూడా దిగిరాక తప్పదని ఆయన అన్నారు. కల్లాల్లోకి కాంగ్రెస్ ఉద్యమంతో కేసీఆర్ అహంకారాన్ని అణుచుతామని రేవంత్ అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజా కొనే వరకు వదలమని ఆయన హెచ్చరించారు.