వరంగల్ కేఎంసిలో పిజి మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆందోళనకు దిగింది. హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ముందు భైఠాయించిన ఏబీవీపీ నాయకులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత కొంత కాలంగా సీనియర్ విద్యార్థి వేధిస్తున్నాడని ప్రీతి కళాశాల అధికారులకు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోలేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ ఆరోపించారు. మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దౌర్భాగ్యం అని అన్నారు. గిరిజన విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణమైన సీనియర్ విద్యార్థి డిగ్రీ రద్దు చేసి... నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు.. నిమ్స్ హాస్పిటల్ ముందు బహుజన విద్యార్థి సంఘాలు, బహుజన ముక్తి పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రీతి కేసులో ఏ1గా ప్రిన్సిపల్, ఏ2గా సైఫ్‌ను పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 24 గంటలు గడుస్తున్నప్పటికీ ప్రీతి ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ ఎందుకు రిలీజ్ చేయలేదని వారు నిమ్స్ వైద్యులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనపై ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి తండ్రి చెబుతున్నవి వాస్తవాలేనని.. ఆ దిశగా ఎందుకు విచారణ జరపడం లేదని ఆరోపించారు. తమ ప్రశ్నలకు అధికారులు వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
